SSC Public Exams 2025: మార్చి 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు.. ఆ వార్తలు వ్యాప్తి చేస్తే ఖఠిన చర్యలు: సర్కార్ వార్నింగ్
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మార్చి 12న ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..

అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవ్వరి వద్ద మొబైల్ ఫోన్ ఉండేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా పోన్లు తీసుకువస్తే వాటిని గేటువద్దే సేకరించి భద్రపరచాలని సూచించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మార్చి 12న ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అలాగే పరీక్షల నిర్వహణ సమయంలో పేపర్ లీక్‌లకు సంబంధించి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ఎవరైనా వ్యాప్తి చేస్తే.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు చేయాలని విజయానంద్ ఆదేశించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,19,275 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 3,15,697 మంది, బాలికలు 3,03,578 మంది వరకు ఉన్నారు.
మొత్తం 3,450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలు 163 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హెల్పలైన్ నంబర్ 0866 2974540కు ఫోన్ చేయాలని సూచించారు. మరోవైపు సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి అభ్యర్థులకు కూడా రెగ్యులర్ వారితోనే కలిపి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు మార్చి 17 నుంచి 28 వరకు జరగనున్నాయి. మొత్తం 30,344 మంది సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి విద్యార్ధులు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ జారీ చేసిన సంగతి తెలిసిందే. వాట్సప్ ద్వారా కూడా వీటిని పొందే సదుపాయం ప్రభుత్వం కల్పించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.