AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒకేరోజు ముగ్గురు KGBV విద్యార్ధినులు ఆత్మహత్య.. అసలేం జరుగుతోందక్కడ?

తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు మూడు వేరువేరు KGBVల్లో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ 3 ఘటనలూ ఒకే రోజున జరగడం.. అదీ ముగ్గురూ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో చదువుతున్నవారే కావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర గురుకులాల్లో అసలేం జరుగుతుందంటూ విమర్శలు వస్తున్నాయి..

Telangana: ఒకేరోజు ముగ్గురు KGBV విద్యార్ధినులు ఆత్మహత్య.. అసలేం జరుగుతోందక్కడ?
Telangana KGBV Students Suicide
Srilakshmi C
|

Updated on: Jul 16, 2025 | 11:17 AM

Share

వరంగల్‌, జూలై 16: వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజి గూడ గ్రామానికి చెందిన నవీంద్ర (16) అనే బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మగల్ల నవీన్ కుమార్ అనే యువకుడు తమ బాలికను వేదించేవాడు. గతంలో పాలమాకుల కస్తుర్భా పాఠశాలలో చదువుతుండగా అక్కడికి కూడా వెళ్ళేవాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువకుడు పదే పదే బాలిక కోసం పాఠశాలకు వస్తూ ఉండడంతో ఇతర విద్యార్థులపై ప్రభావం పడుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపారు. అప్పటి నుండి బాలిక ఎవరితో సరిగ్గా మాట్లడటం లేదని తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పక్కన ఉన్న షెడ్‌లో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

క్లాస్‌ రూంలో ఉరి వేసుకుని మరొకరు..

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14) నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. జులై 4న జ్వరంతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి జులై 6వ తేదీన పాఠశాలకు వచ్చింది. ఆదివారం తనూషా తల్లి పాఠశాల వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం తండ్రి వెంకటేశ్వర్లు కూడా పాఠశాలకు వచ్చి తనూషాను చూసి వెళ్లాడు. ఏంజరిగిందో తెలియదుగానీ మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని పదో తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. సంఘటన జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇంటిపై బెంగతో ఇంకొకరు..

నారాయణపేట జిల్లా భూత్పూర్‌కు చెందిన సాయి శ్రుతి గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని KGBVలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఏం జరిగిందో తెలియదుగానీ మంగళవారం పాఠశాలలోని మొదటి అంతస్తు నుంచి సాయి శ్రుతి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన విద్యార్ధిని పాఠశాల సిబ్బంది వెంటనే గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ బాలిక వెన్నెముకకు తీవ్రగాయమైందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. సాయిశ్రుతి ఇంటిపై బెంగతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పాఠశాల స్పెషలాఫీసర్‌ పద్మావతి తెలిపారు. ఇటీవల గురుకుల పాఠశాలల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతోంది. రేవంత్‌ సర్కార్‌ ఇకనైనా వీటిపై దృష్టి పెట్టి విద్యార్ధుల జీవితాలను కాపాడాలంటూ మోరపెట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.