AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL : రూ.11,000 కోట్ల బ్రాండ్ వ్యాల్యూ.. ఐపీఎల్ తర్వాత ఈ క్రికెట్ లీగ్‌కు అంత క్రేజ్ ఎందుకు?

IPL : ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యుయేషన్ ఏకంగా 20.6 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఐపీఎల్ రెండో స్థానంలో నిలిచింది. ఇక క్రికెట్ లీగ్‌లలో ఐపీఎల్ తర్వాత ది హండ్రెడ్ రెండో స్థానంలోకి వచ్చింది. పీఎస్ఎల్, ఎస్ఏ20 విలువలు మాత్రం ఇంకా వెనుకే ఉన్నాయి.

IPL : రూ.11,000 కోట్ల బ్రాండ్ వ్యాల్యూ.. ఐపీఎల్ తర్వాత ఈ క్రికెట్ లీగ్‌కు అంత క్రేజ్ ఎందుకు?
The Hundred League
Rakesh
|

Updated on: Aug 05, 2026 | 3:04 PM

Share

IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాకతో ప్రపంచ క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. 20వ శతాబ్దంలో క్రికెట్ లవర్స్ కేవలం టెస్టులు, వన్డే మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమవ్వగా, 21వ శతాబ్దంలో టి20 ఫార్మాట్ కొత్త శకానికి నాంది పలికింది. కేవలం 19 ఏళ్ల స్వల్ప కాలంలోనే ఐపిఎల్ సంపాదనలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యుయేషన్ ఏకంగా 20.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు (సుమారు రూ. 2 లక్షల కోట్లు) చేరుకుని ప్రపంచ క్రీడా రంగాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్పోర్ట్స్ లీగ్‌గా బీసీసీఐ ఐపిఎల్

బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ఏటేటా తమ ఆదాయాన్ని విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. నేడు ఇది కేవలం క్రికెట్‌లోనే కాకుండా, ప్రపంచంలోని అన్ని రకాల క్రీడలలో కెల్లా అత్యధిక విలువ కలిగిన రెండవ అతిపెద్ద లీగ్‌గా రికార్డులకెక్కింది. సంపాదన, బ్రాండ్ వ్యాల్యూ పరంగా కేవలం అమెరికన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) మాత్రమే ఐపిఎల్ కంటే ముందు వరుసలో ఉంది. ఐపీఎల్ సాధించిన ఈ అద్భుత విజయాన్ని చూసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, నేపాల్ వంటి అనేక దేశాలు తమ స్వంత టి20 లీగ్‌లను ప్రారంభించాయి.

ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రికెట్ లీగ్ ఏదో తెలుసా?

ఐపిఎల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాష్ లీగ్ (BBL), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), SA20 వంటి లీగ్‌లు ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ, సంపాదన పరంగా రెండవ స్థానంలో నిలిచిన లీగ్ ఏదో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చాలామంది పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లేదా బిగ్ బాష్ లీగ్ అనుకుంటారు, కానీ అసలు నిజం ఏంటంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన ది హండ్రెడ్ లీగ్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా అవతరించింది.

ఐపిఎల్ ఓనర్ల ఎంట్రీతో మారిన ది హండ్రెడ్ జాతకం

రిపోర్ట్స్ ప్రకారం 2024 లో ఇంగ్లాండ్ ది హండ్రెడ్ లీగ్ బ్రాండ్ విలువ సుమారు 610 మిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఈ లీగ్‌లోని జట్లలో వాటాలను అమ్మకానికి పెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ యజమానులు అందులో భారీగా పెట్టుబడులు పెట్టారు. విదేశీ పెట్టుబడిదారులు, వందల కోట్ల డీల్స్ పూర్తయిన తర్వాత ది హండ్రెడ్ లీగ్ బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 1.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 11,000 కోట్లు) చేరి, ఐపిఎల్ తర్వాత రెండవ అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా నిలిచింది.

పీఎస్ఎల్, ఎస్ఏ20 లీగ్‌ల పరిస్థితి ఏంటి?

ఆదాయం, బ్రాండ్ వ్యాల్యుయేషన్ విషయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా వెనుకబడిపోయింది. నివేదికల ప్రకారం పీఎస్ఎల్ బిజినెస్ వ్యాల్యుయేషన్ కేవలం 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,100 కోట్లు) మాత్రమే. ఇది ఐపిఎల్, ది హండ్రెడ్‌లతో పోలిస్తే చాలా స్వల్పం. మరోవైపు సౌతాఫ్రికాకు చెందిన SA20 లీగ్ కూడా మంచి ఆర్థిక పురోగతిని సాధించింది. 2025 గణాంకాల ప్రకారం SA20 లీగ్ ఏకంగా 45 మిలియన్ డాలర్లకు పైగా లాభాలను నమోదు చేసి అంతర్జాతీయ లీగ్‌లలో తనదైన ముద్ర వేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us