TGPSC Group 2 Final Results: టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఎంపిక జాబితా వచ్చేసింది.. ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. మొత్తం 783 ఉద్యోగాలకు కమిషన్ ప్రకటన ఇవ్వగా.. ఇందులో 777 మందిని కమిషన్ ఎంపికైనట్లు ప్రకటించింది. అందులో ఇద్దరు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను..

హైదరాబాద్, మే 23: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. మొత్తం 783 ఉద్యోగాలకు కమిషన్ ప్రకటన ఇవ్వగా.. ఇందులో 777 మందిని కమిషన్ ఎంపికైనట్లు ప్రకటించింది. అందులో ఇద్దరు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులందరికీ మే 29 నుంచి జూన్ 10వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్ జారీ చేసిన ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఏదైనా సర్టిఫికెట్ సమర్పించడంలో అభ్యర్ధులు విఫలమైతే.. అవికూడా సమర్పించేందుకు జూన్ 11వ తేదీని కమిషన్ రిజర్వ్ చేసింది. అంటే ఈ పోస్టులకు 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్లను పరిశీలించి, నియామక పత్రాలు సమర్పిస్తారన్నమాట.
సురవరం యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ (గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరుతో ఉండేది)లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. వెరిఫికేషన్ సమయంలో హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్‌టిక్కెట్ నంబర్ల వారీగా హాజరుకావల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను మే 26న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని కమిషన్ వెల్లడించింది. అభ్యర్ధులు ఎవరైనా గైర్హాజరైతే వారి అభ్యర్ధిత్వం రద్దు చేయబడుతుందనీ, ఆ పోస్టును తదుపరి ర్యాంకు వచ్చిన వారికి అందజేస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఎంపిక జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 సర్విసులకు18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్ 29న నియామక నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత రాత పరీక్షలు వివిధ కారణాలతో మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో మొత్తం 1368 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. అయితే పరీక్షకు 2,49,964 మంది మాత్రమే మొత్తం 4 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 777 మంది ఫైనల్‌గా ఎంపికయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




