Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం అందించేందుకు రూ.4.23 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మొత్తం 19 రోజుల పాటు ఈ స్నాక్స్ పంపిణీ చేయనున్నారు.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలో జరగనున్న SSC వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం అందించేందుకు నిధులను మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల కోసం మొత్తం రూ. 4,23,11,385 నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు విడుదల చేయాలని స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో నిర్వహించే ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు ఈ ఈవెనింగ్ స్నాక్స్ పంపిణీ చేయనున్నారు. మొత్తం 19 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు స్నాక్స్ అందించనున్నారు.
పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, సాయంత్రం వేళ అదనపు గంటలు చదువుకునే వారికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లెర్నింగ్ ఎన్‌హాన్స్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాయంత్రం పూట స్నాక్స్ అందించడం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
