Govt Schools: ఇక ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్లకు దబిడిదిబిడే.. కీలక ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలతోపాటు కేజీబీవీలు, మోడల్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆటలు ఇకపై సాగేలా లేదు. ఇంతకీ అసలు విషయం ఏమంటే..
హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను అందరికీ కనిపించే విధంగా బడుల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన టీచర్ల స్థానంలో ఇతర ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయని. ఇలా ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ ఫొటోలను ఆయా పాఠశాలల్లో ప్రదర్శించాలని కేంద్ర విద్యాశాఖ పలుమార్లు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కూడా పాఠశాలల్లో టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు సీనియర్ టీచర్లు ఆయా గ్రామాలకు చెందిన యువతీ యువకులకు రూ.10 వేల వరకు ఇచ్చి, వారిని బోధకులుగా నియమించినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇదే తరహాలో హైదరాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులకు ఇతర డ్యూటీ (ఓడీ) సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తరబడి హాజరు కావడం లేదన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఇదే మాదిరి ప్రైవేట్ వ్యక్తులు టీచర్లుగా పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ విధమైన తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, తప్పనిసరిగా అన్ని పాఠశాలలు తమ ప్రాంగణాల్లో అక్కడ పనిచేసే టీచర్ల ఫొటోలను ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అదేశించింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగాలో ప్రవేశాలకు గడువు పెంపు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఎమ్మెస్సీ యోగా ప్రవేశాల గడువును పెంపొందిస్తూ ప్రకటన జారీ అయ్యింది. ఎమ్మోస్సీ యోగా మొదటి ఏడాది, డిప్లొమా ఇన్ యోగాలో చేరేందుకు డిసెంబరు 16 వరకు గడువు పెంచినట్లు వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ రెండో ఏడాదిలో చేరేందుకు పీజీ డిప్లొమా పూర్తి చేయాలన్నారు. ఇతర వివరాలను ఏఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్ లో ఉంచామని జాన్సన్ వెల్లడించారు.