వీకెండ్‌లో మాత్రమే మందేసే వారికి షాకింగ్ న్యూస్.. ఓసారి ఈ ఫొటో వైపు లుక్కేస్కోండి
మందేసేందుకు సవాలక్ష కారణాలు వెతుక్కుంటారు మందుబాబులు. మరికొందరు తెలివిగా 'అబ్బే.. రోజూకాదు. ఎప్పుడో వారినికి ఒక్కసారే' నని సర్ధి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఓ డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే..
‘ఛీఛీ.. నేను రెగ్యులర్‌గా తాగను! వారంలో ఒకరోజు… ఎప్పుడో వీకెండ్‌లో ఒక్కసారి మాత్రమే. అదీ చాలా లైట్‌గా..’ చాలా మంది మందుబాబులు కామన్‌గా చెప్పే డైలాగ్ ఇది. తాగే అలవాటు లేదని ‘అప్పుడప్పుడూ’ మాత్రమే అనేవారికి దిమ్మతిరిగే న్యూస్. వారంలో ఒక్కసారి మద్యపానం చేసినా మీ ఆరోగ్యం ఎంత నష్టం పోతుందో.. ఎవరైనా చెబితే దాదాపు కొట్టినంత పనిచేస్తారు. అలాంటి మూర్ఖులకు ఓ డాక్టర్ షేర్ చేసిన ఫోటో చూస్తే జన్మలో మందు జోలికి పోరు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది మరలా మరలా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. వైద్యులు కూడా పదే పదే హెచ్చరిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అయితే ఒక్క చుక్క మద్యం సేవించడం అస్సలు మంచిది కాదని ఎన్నో సార్లు హెచ్చరిస్తూనే ఉంది. ఇలాంటి హెచ్చరికలు విన్న-చదివి-చూసిన తర్వాత కూడా మందుబాబులు చేసేది షరా మామూలే. వీరిలో కొందరు క్రమం తప్పకుండా తాగితే.. మరికొందరు అప్పుడప్పుడు తాగుతారు. డా. సిరియాక్ అబ్బి ఫిలిప్స్ వారాంతాల్లో కొద్దిగా తాగుతామని చెప్పే వారి కోసం ఓ షాకింగ్ ఫొటోను పోస్ట్ చేశాడు. డా. సిరియాక్ అబ్బి ఫిలిప్స్ సోషల్ మీడియాలో ‘ది లివర్ డాక్’గా ఫేమస్.
సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ ఖాతాలో ది లివర్ డాక్ డాక్టర్ ఫిలిప్స్ చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. హలో, నేను 32 ఏళ్ల వ్యక్తి కాలేయం చిత్రాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇతను ‘వారాంతాల్లో మాత్రమే తాగే వ్యక్తి. ప్రస్తుతం అతను ఆరోగ్యకరమైన కాలేయ దాత కోసం వెతుకుతున్నాడు. ఎందుకంటే ఇతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఇక్కడ ఇచ్చిన రెండు ఫొటోలు అతడివే… అంటూ 2 ఫొటోలతోపాటు ఓ మెజేస్ కూడా పోస్ట్ చేశాడు. ఒకటి వారాంతాల్లో మాత్రమే మద్యం సేవించే వ్యక్తి లివర్ ఫొటో ఒకటి, రెండోది ఆరోగ్యంగా ఉన్న అతని భార్య లివర్ ఫొటో మరొకటి. ఈ రెండు ఫొటోలు డాక్టర్ ఫిలిప్స్ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్‌లో కామెంట్లు పెడుతున్నారు.
‘మద్యం విషం. ఇది ఎల్లప్పుడూ నిజం. ఇది మీ కాలేయంపై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. కాలక్రమేణా కొవ్వు కాలేయం, ఫైబ్రోసిస్, సిర్రోసిస్‌గా మారి చివరికి కాలేయ వైఫల్యం జరుగుతుంది. మీరు దాని లక్షణాలు తెలుసుకునే సమయానికి, ఆలస్యం అవుతుంది. మద్యం తాగేవారంతా ఈ రోజే మేల్కొంటే మంచిది. మద్యం సేవిస్తే కాలేయం క్రమంగా పాడైపోతుంది. తాగేటప్పుడు ఆ సంగతి నీకు గుర్తుండకపోవచ్చు. కానీ చివరికి జరిగేది ఇదే’నని ఓ యూజన్ హితవు పలికాడు.