Telangana: తెలంగాణ విద్యార్ధికి రూ.3.20 కోట్ల భారీ ఫ్యాకేజీతో గూగుల్ జాబ్ ఆఫర్.. ‘కష్టం వృథా కాలేదు’
తెలంగాణకు చెందిన విద్యార్థి భారీ ప్యాకేజీతో గూగుల్‌లో ఉద్యోగం పొందాడు. తాజాగా గూగుల్ చేపట్టిన నియామకాల్లో ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్‌నగర్ గ్రామానికి చెందిన కొండా అఖిల్ (27)..
తెలంగాణకు చెందిన విద్యార్థి భారీ ప్యాకేజీతో గూగుల్‌లో ఉద్యోగం పొందాడు. తాజాగా గూగుల్ చేపట్టిన నియామకాల్లో ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్‌నగర్ గ్రామానికి చెందిన కొండా అఖిల్ (27) దాదాపు రూ.3.20 కోట్ల వార్షిక వేతనంతో కొలువును సొంతం చేసుకున్నాడు. అఖిల్ తండ్రి కొండా నారాయణ, తల్లి రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆర్‌ఎంపీగా డాక్టర్ అయిన నారాయణ తన కొద్దిపాటి ఆదాయంతో కొడుకు అఖిల్‌ను 1 నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు స్కూల్‌లో చదివించాడు. డ్రిల్ మాస్టర్ సహాకారంతో సింగరేణి స్కూల్లో చేర్పించాడు. అఖిల్ చిన్నతనం నుంచే తోటి విద్యార్ధుల కంటే ఎంతో మెరుగ్గా ప్రతిభకనబరిచేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ ఏడో తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అఖిల్ ఆరో ర్యాంక్ సాధించాడు. దీంతో ఆ విద్యాసంస్థ అఖిల్‌కు 7వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు ఉచితంగా అన్ని ఫీజులు చెల్లించింది.
అనంతరం ఐఐటీ ప్రవేశ పరీక్షలో 1200 ర్యాంకు రావడంతో ఖరగ్‌పూర్ ఐఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు పొందాడు. అమెరికా వెళ్లి ఎంఎస్ చదవాలని కలలు కన్న అఖిల్‌కు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఓ ప్రైవేటు కంపెనీలో రెండేళ్లు ఉద్యోగం చేశాడు. తర్వాత హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో రూ.80 లక్షలు ఎడ్యుకేషన్ లోన్‌తోపాటు, బయట రూ.20 లక్షలు అప్పు తీసుకుని న్యూయార్క్‌లోని కొలొంబియా యూనివర్సిటీలో ఎంఎస్‌లో ప్రవేశం పొందాడు. ఈ ఏడాది మేలో చదువు పూర్తి చేసుకున్న అఖిల్‌కు గూగుల్ రూపంలో అదృష్టం వరించింది. ఏకంగా రూ.3.2 కోట్ల వార్షిక వేతనంతో కాలిఫోర్నియా ఉద్యోగం సాధించాడు. కుమారుడి విజయం పట్ల తండ్రి నారాయణ ఎనలేని ఆనందం వ్యక్తం చేశారు. తన కుటుంబ సహకారం వల్లనే ఇదంతా సాధ్యమయ్యిందని అఖిల్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.