TS Govt Jobs 2022: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! గ్రూప్ 2, 3, 4 ఉద్యోగాల సంఖ్యను పెంచిన రాష్ట్ర సర్కార్.. ఎన్నంటే..
టీఎస్పీయస్సీ ద్వారా త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ 2, 3, 4 ఉద్యోగాల్లో మరికొన్నింటిని అదనంగా చేర్చుతూ గురువారం (నవంబర్ 24) రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది..
తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే 503 గ్రూప్ 1 పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలను పూర్తిచేసింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ కూడా విడుదల చేసింది. ఇక గ్రూప్ -2 కింద 663 పోస్టులకు, గ్రూప్-3 కింద 1373 పోస్టులకు, గ్రూప్-4 కింద 1298 పోస్టులకు అనుమతి కూడా తెల్పింది. టీఎస్పీయస్సీ ద్వారా త్వరలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల్లో మరికొన్నింటిని అదనంగా చేర్చుతూ గురువారం (నవంబర్ 24) రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సవరించింది. గ్రూప్-2లో మరో ఆరు రకాల పోస్టులు, గ్రూప్-3లో రెండు పోస్టులు, గ్రూప్-4లో మరో నాలుగు రకాల పోస్టులను చేర్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పెరిగిన జాబ్స్ ఇవే..
- గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో అదనంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉంటాయి.
- గ్రూప్-3లో అదనంగా గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను చేర్చారు.
- గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో అదనంగా జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేర్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.