TG DSC 2024 Final Results: డీఎస్సీ పోస్టులకు 1:1 నిష్పత్తిలో తుది జాబితా.. తొలుత స్కూల్ అసిస్టెంట్, ఆ తర్వాతే ఎస్జీటీ..!
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియ వడివడిగా సాగుతోంది. అక్టోబర్ 5వ తేదీతో జనరల్ ర్యాంకింగ్ జాబితాలో 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక తదుపరి చర్యలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు అభ్యర్ధులు స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా పాఠశాల..
హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియ వడివడిగా సాగుతోంది. అక్టోబర్ 5వ తేదీతో జనరల్ ర్యాంకింగ్ జాబితాలో 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక తదుపరి చర్యలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు అభ్యర్ధులు స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో వందల మంది అభ్యరులు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారు చివరిగా ఏదో ఒక పోస్టును ఎంపిక చేసుకుంటే తదుపరి వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా మిగిలి పోతున్నాయి. ఈ పరిసితిని నివారించేందుకు తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో తుది జాబితా విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఆ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారి జాబితా వెలువడనుంది. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి, ఆ తర్వాత మెరిట్‌లో ఉన్న వారిని వారి స్థానంలో చేరుస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఇక స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల్లో ఈసారి 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 796 ఎస్‌జీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి టెట్ మార్కులు అవసరం లేదని గత ఏప్రిల్‌లో 62 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 17 జిల్లాల్లోనే ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయగా.. 16 జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈసారి టీచర్ పోస్టులకు పోటీపడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివాహం ముందు, తరువాత వారి ఆధార్‌కార్డుల్లో ఇంటి పేర్లు, ఇతర వివరాలు వేరుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా డీఈవోలు సదరు మహిళా అభ్యరుల భర్తలను పిలిచించి వారితో ఈమె తన భార్య అని లెటర్ రాయించుకుని, దానిని ధ్రువపత్రాల్లో చేర్చి తీసుకున్నట్లు తెలిపారు.