NEET UG 2021: NEET UG ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.. వివరాలు తెలుసుకోండి..
NEET UG 2021: 2021 సంవత్సరానికి గానూ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలను ప్రకటించేందుకు
NEET UG 2021: 2021 సంవత్సరానికి గానూ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలన్న బాంబే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించడం ద్వారా నీట్ యూజీ ఫలితాల ప్రకటనకు సుప్రీంకోర్టుకు చేరింది. సెప్టెంబరు 12న జరిగిన నీట్ పరీక్షలో ఇద్దరు అభ్యర్థులు తమ టెస్ట్ బుక్‌లెట్‌లు, ఓఎంఆర్ షీట్‌లు మిక్సింగ్‌గా ఉన్నాయని ఆరోపించారు.
దీంతో ఫలితాలను ప్రకటించవద్దని బాంబే హైకోర్టు NTAని కోరింది. న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, దినేష్ మహేశ్వరి, బిఆర్ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసింది. “ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తున్నాం NTA NEET UG ఫలితాన్ని ప్రకటించవచ్చు” అని ప్రకటించింది. దాదాపు 16 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ఇద్దరు విద్యార్థుల కోసం నిలుపుదల చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో ఎన్టీఏ ఫలితాలను విడుదలకు సిద్ధమైనప్పటికీ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల ఆగిపోయింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నీట్ ఫలితాల ఆలస్యం గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్లపై ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం తన విజ్ఞప్తిలో పేర్కొంది. అయితే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని కొన్ని ఎఫ్‌ఐఆర్‌ల కారణంగా ఫలితాలను రద్దు చేయలేమని విద్యార్థులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఇదిలా ఉంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే నీట్‌లో అర్హత సాధించాల్సిందే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిఫారసుల మేరకు బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పరీక్షను తప్పనిసరి చేశారు. నీట్ అర్హత ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.