AP Tenth Exams : పదో తరగతి పరీక్షలపై కొనసాగుతున్న ఉత్కంఠ..! వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే నిర్వహించాలని పిటిషనర్ల వాదన..
AP Tenth Exams : ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్‌ను పరిగణనలోకి
AP Tenth Exams : ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ టీచర్లకి వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే పరీక్షలు జరపాలని పిటిషన్ దారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 1లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు నిర్ణయం కోసం చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జూన్ 7వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా.. నెల రోజుల పాటు వాయిదా వేయాలంటూ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉండటం, అలాగే కొన్ని పాఠశాలలు క్వారంటైన్ కేంద్రాలుగా మార్పు చెందటంతో.. ఈ పరిస్థితుల్లో పరీక్షలకు ఏర్పాటు చేయడం కష్టతరమని విద్యాశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. అలాగే పది పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను సైతం అందులో ప్రస్తావించింది.
ఇదిలా ఉంటే ఒకవేళ పరీక్షలు వాయిదా పడితే.. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం అధికారులు ముందుగానే ఇంటర్నల్ మార్కులు నమోదు చేసే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, హరియానా, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేయగా.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్తాన్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.