NEET-JEE Merge: జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల రద్దు దిశగా యూజీసీ స్కెచ్! సీయూఈటీలో విలీనానికి ప్రతిపాదనలు..
ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులను సీయూఈటీ-యూజీ (Common University Entrance Test-Undergraduate)లో విలీనం చేసే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కసరత్తులు చేస్తోంది..
UGC plan to merge all entrance tests is a messy idea: ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులను సీయూఈటీ-యూజీ (Common University Entrance Test-Undergraduate)లో విలీనం చేసే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కసరత్తులు చేస్తోంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలకు వేరువేరుగా ఎంట్రన్స్ టెస్టులు రాయకుండా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆయా సబ్జెక్టుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అంటే ఒకే సింగిల్ ఎగ్జాం రాయడం ద్వారా వివిధ సబ్జెక్టుల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చని యూజీసీ చైర్మన్ ఎమ్ జగదీష్ కుమార్ మీడియాకు తెలిపారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌కు రాసే జేఈఈ మెయిన్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష, సీయూఈటీ యూజీ పరీక్షతో కలిపి మొత్తం 3 మేజర్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీటికి దేశ వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. మెజారిటీ స్టూడెంట్స్ వీటిల్లో కనీసం రెండు పరీక్షలకైనా హాజరవుతున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను అటెంప్ట్ చేస్తున్నారు. నీట్ యూజీ పరీక్షలో కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్టును బయాలజీ రీప్లేస్ చేస్తుంది. ఈ సబ్జెక్టులన్నీ కూడా సీయూఈటీ- యూజీలో ఉన్న 61 విభాగాల్లో ఇప్పటికే ఉన్నాయి. రకరకాల ఎంట్రన్స్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్ధులు ఒత్తిడికి గురికాకూడదనే తాజా ప్రతిపాదన ప్రధాన లక్ష్యం. ఒకే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించే దిశగా యూజీసీ చర్చలు జరుపుతోంది. తద్వారా విద్యార్దులు ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షను రాయడానికి అవకాశం ఉంటుంది. బోర్డు పరీక్షల తర్వాత ఒకసారి, డిసెంబర్‌లో మరొకసారి రాయవచ్చని జగదీష్ కుమార్ అన్నారు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంక్ నిర్ణయించబడుతుంది. మెడిసిన్ చదవాలనుకునే వారికి ఇదే విధమైన పద్ధతి ఉంటుంది. ఒక వేళ విద్యార్ధులు మెడిసిన్ లేదా ఇంజనీరింగ్‌లోకి వెళ్లాలనికోరుకోకపోతే.. సీయూఈటీ కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయాలజీ వంటి వాటిల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇతర ప్రోగ్రాముల్లో చేరే వెసులుబాటు ఉంటుంది. అంటే ఒకసారి పరీక్ష రాయడం వల్ల ఈ నాలుగు సబ్జెక్టులతో విద్యార్థులు విభిన్న అవకాశాలు పొందవచ్చని యూజీసీ ఛైర్మన్ తెలిపారు.
నిజానికి ‘ఒన్ నేషన్ ఒన్ ఎగ్జామినేషన్ (One nation, one exam)’ ఆలోచన బాగానే ఉన్నా ఆచరణలో సఫలం అవుతుందో లేదో అనేది తెలుసుకునేందుకు దీనిపై విస్తృత చర్చ జరపడం అవసరం. తొందరపాటు లేదా ఏకపక్ష నిర్ణయాలతో ప్రతికూల ఫలితాలు రావచ్చు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, కెరీర్ అవకాశాలను పెంపొందించడం అనేది గొప్ప ఆలోచనే. కానీ ఆచరణలో సాధ్యంకాకపోతే విద్యార్ధులపై మరింత భారం పడి, మరింత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు.