‘రెక్కలు తొడిగిన లైఫ్ డ్రీమ్’.. 6 పదుల వయసులోనూ PhD పట్టా అందుకున్న బామ్మ..!
ఎప్పుడూ వయస్సు ఏ పనికీ అడ్డంకి కాదు. నిబద్ధత, జ్ఞానం, అభిరుచి పట్ల మక్కువ కలిగి ఉంటే నేర్చుకోవడం ఎప్పుడూ ఆలస్యం కాదు. అలాగే బోధించడం కూడా ఎప్పుడూ ఆలస్యం కాదు. చిరకాల కలలను వెంబడించడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదని అంటున్నారు ఈ గురుశిష్యులు. ఒకరికి 70 ఏళ్లు.. మరొకరికి 60 యేళ్లు.. ఈ వయసులోనూ చదువుపట్ల ఎంతో నిబద్ధతతో PHd పట్టా అందుకుందీ బామ్మ..

చదువుకు వయసు అడ్డు కాదని ఇప్పటికే ఎందరో నిరూపించారు. ఆ జాబితాలో తాజాగా ఓ బామ్మ కూడా చేరింది. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే.. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే చాలు దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఈ 60 ఏళ్ల బామ్మ. పీహెచ్‌డీ చేయాలనే కలలు కన్న బామ్మకు.. 70 యేళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ముఖర్జీ బాటలు వేశారు. చాలా మంది పదవీ విరమణ పొందాక హాయిగా గడిపేందుకు చక్కని ఇల్లు, ఆర్ధిక వనరులు సమకూర్చుకుని తడిగుడ్డ పరచుకుని చివరి దాకా గడిపేస్తారు. కానీ డాక్టర్ ముఖర్జీ ఇందుకు పూర్తిగా విభిన్నం. ఆయన రిటైర్ట్ అయ్యాక కూడా ఓ వినూత్న పద్ధతిలో తన కొత్త ప్రయాణం ప్రారంభించారు. చదువుకోవాలనే తమ కలను నెరవేర్చుకోవడంలో విఫలమైన వారికి అండగా నిలిచి.. ఆరిపోయిన వారిలోని జిజ్ఞాసను మళ్లీ రగిలించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అలా ఆయన ప్రయాణంలో 60 ఏళ్ల విద్యార్థి ఉదయ్ కొత్వాల్ దొరికింది. డాక్టర్ ముఖర్జీ సాయంతో ఆమె తన లైఫ్ డ్రీమ్ ఎంటమాలాజీ (కీటక శాస్త్రం)లో పీహెచ్‌డీ పట్టా పొందారు.
ఎవరీ ఉదయ్ కొత్వాల్?
ఉదయ్ కొత్వాల్.. 1991లో ఆర్కె తల్రేజా కళాశాల నుంచి జంతుశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎంటమాలాజీలో పీహెచ్‌డీ చేయాలనుకుంది. కానీ తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. తన కుటుంబానికి ఏకైక జీవనాధారమైన ఆమె తన కలను బలవంతంగా చంపుకుని ఓ బ్యాంకులో బ్యాంకులో క్లర్క్ ఉద్యోగంలో చేరి కుటుంబం కోసం కొవ్వొత్తి మాదిరి కరిగింది. అలా కరుగుతూ 60 యేళ్లకు చేరుకుంది. కాలక్రమేణా కోత్వాల్ బ్యాంకు మేనేజర్ పదవి చేరి, పదవీ విరమణ కూడా పొందింది. అలాగే మనసులోని తన డ్రీమ్ కూడా అట్టడుగున పడిపోయింది. తన కల ఎప్పటికీ కల్లగానే మిగిలిపోతుందేమోనని అనుకుంది. ఆరేళ్ల క్రితం పదవీ విరమణ పొందిన కోత్వాల్ తన అభిరుచికి మళ్లీ రెక్కలు తొడికి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టింది. తన సబ్జెక్టులో పీహెచ్‌డీ చేసేందుకు మార్గాలను అన్వేషించింది. సీతాకోక చిలుకలపై తన అధ్యయనం చేయాలని అనుకుంది. దీనిపై వార్తాపత్రికల్లో కథనాలు, ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగాలు కూడా ఇచ్చింది. సీతాకోకచిలుకలు పర్యావరణ ఆరోగ్యానికి చాలా సున్నితమైన సూచికలు. స్వల్ప పర్యావరణ మార్పులు కూడా వాటి ఉనికిని ప్రభావితం చేస్తాయి. వాటి రంగురంగుల రెక్కలు గాలిలో నృత్యం చేయడాన్ని చూడటం సహజ ఒత్తిడిని తగ్గిస్తుందని అంటారామె.
ఈ క్రమంలో తన మాజీ ప్రొఫెసర్ డాక్టర్ మంగళ ముఖర్జీని తిరిగి కలిసి తన కల గురించి చెప్పి.. ఆయన మార్గదర్శకంలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ, DHEDలో పట్టా పొందింది. దశాబ్దాల బోధన, పరిశోధన అనుభవంతో పది మంది ఎంఫిల్, ఒక పీహెచ్‌డీ స్కాలర్‌కు మార్గనిర్దేశం చేస్తున్న డాక్టర్ ముఖర్జీ కొత్వాల్‌కు కూడా మార్గనిర్దేశం చేయడానికి అంగీకరించారు. తన కెరీర్‌లో చివరి పీహెచ్‌డీ విద్యార్థిగా కొత్వాల్ నిలిచారు. తాను పదవీ విరమణ పొందినప్పటికీ కొత్వాల్ అభిరుచి తనలో మళ్ళీ ఏదో ఉత్తేజాన్ని నింపిందని డాక్టర్ ముఖర్జీ అన్నారు. ఇది కేవలం పరిశోధన గురించి కాదు. బాధ్యతల కింద నలిగిన ఓ విద్యార్థి కలను నెరవేర్చుకోవడంలో తనవంతు సహాయంగా తోడ్పడినట్లు తెలిపారు.
కొత్వాల్ తొలుత చదువుకున్న ఆర్‌కె తల్రేజా కళాశాల నుండి PHd చేయాలని ఆశించినప్పటికీ.. ఆ కళాశాలలో పీహెచ్‌డీ అధ్యయనానికి రిజిస్టర్డ్ ల్యాబ్ లేదు. దీంతో వారు అవసరమైన అనుమతులు కలిగిన వాజే కేల్కర్ కాలేజీని సంప్రదించి అధికారికంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి పరిశోధన మాథెరన్, పావ్లి కొండల దిగువ ప్రాంతంలోని సీతాకోకచిలుకలు, డ్రాగన్‌ఫ్లైలు, డామ్‌సెల్ఫ్లైల వైవిధ్యంపై దృష్టి సారించింది. సంవత్సరాల తరబడి డాక్యుమెంటేషన్, ఫీల్డ్ వర్క్ తర్వాత.. చివరికి కోత్వాల్ తన డాక్టరేట్ పట్టాను పొందగలిగింది. ప్రతి విద్యార్థికి డాక్టర్ ముఖర్జీ లాంటి గురువు అవసరమని కోత్వాల్ ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ వయస్సు ఏ పనికీ అడ్డంకి కాదు. నిబద్ధత, జ్ఞానం, అభిరుచి పట్ల మక్కువ కలిగి ఉంటే నేర్చుకోవడం ఎప్పుడూ ఆలస్యం కాదు. అలాగే బోధించడం కూడా ఎప్పుడూ ఆలస్యం కాదు. చిరకాల కలలను వెంబడించడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదని.. రిటైర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ముఖర్జీ అంటున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.