AP PECET 2025 Notification: ఏపీపీఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీఈసెట్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ650 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది..

గుంటూరు, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీఈసెట్ నోటిఫికేషన్‌ను కన్వీనర్ ప్రొఫెసర్ పాల్‌కుమార్ విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా జూన్ 7లోపు దరఖాస్తులు పంపించాలని ఆయన సూచించారు. రూ.1000 అపరాధ రుసుంతో జూన్ 11లోపు, రూ.2 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 13లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు జూన్ 12 నుంచి 14 వరకు అవకాశం కల్పించామని వివరించారు. జూన్ 17 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జూన్ 23 నుంచి ఏఎన్‌యూలో పీఈసెట్ ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
సౌదీలో వేర్‌హౌస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు
విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు అద్భుత అవకాశం. దళారుల మాయలో పడి అడ్డదారిలో విదేశాలకు పోయి చిక్కుల్లో పడి భవిష్యత్తు నాశనం చేసుకోకుండా రాజ మార్గంలో సౌదీ అరేబియాకి పంపే ఛాన్స్ మీ కాళ్ల వద్దకు వచ్చింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఈ అద్భుత అవకాశాన్ని మీ ముందు ఉంచింది. సౌదీ అరేబియాలో వేర్‌హౌస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన నిరుద్యోగులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వయసు తప్పనిసరిగా 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే వేర్‌హౌస్ ఆపరేషన్స్‌లో రెండేళ్ల అనుభవం అవసరం. ఈ అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సీఈవో ఓ ప్రకటనలో కోరారు. ఆసక్తి కలిగిన వారు తమ దరఖాస్తులను tomcom.resume@gmail.com మెయిల్‌కు పంపాలని సూచించారు.
గిరిజనుల్లో నైపుణ్య శిక్షణకు ఎన్‌ఐఆర్‌డీతో కళింగ వర్సిటీ కీలక ఒప్పందం
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల అభివృద్ధి, సామాజిక భద్రత, నైపుణ్య శిక్షణ కోసం జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీ)తో భువనేశ్వర్‌కు చెందిన కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కేఐఎస్‌ఎస్) డీమ్డ్ యూనివర్సిటీ ఏప్రిల్ 5న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజనాభివృద్ధి, పరిశ్రమల స్థాపనపై ఈ రెండు సంస్థలు శిక్షణ కోర్సులను ప్రారంభించనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.