NEET UG 2025 Pattern Changed: నీట్ యూజీ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. ఇకపై ఆ ప్రశ్నలు ఉండవ్!
2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్ష విధానంలో ఎన్టీఏ కీలక మార్పులు చేసింది. కరోనా టైంలో తీసుకొచ్చిన ప్రశ్నలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షనల్ విధానం, పరీక్షకు అదనపు సమయం కేటాయింపులను రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది..

హైదరాబాద్, జనవరి 26: దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్ష విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటికే పేపర్ లీకేజీల నేపథ్యంలో పలు కఠిన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చిన ఎన్టీయే కరోనా సమయంలో ప్రవేశపెట్టిన పలు నిబంధనలకు స్వస్తి చెప్పింది. కరోనా టైంలో ప్రశ్నలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షనల్ విధానం, పరీక్షకు అదనపు సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో నీట్ యూజీ 2025 పరీక్ష గతంలో మాదిరిగానే 180 ప్రశ్నలతోనే ఉంటుందని తాజాగా ఒక ప్రకటనలో ఎన్టీఏ వెల్లడించింది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 45 ప్రశ్నల చొప్పున, బయాలజీ (బోటనీ, జువాలజీ)లో 90 ప్రశ్నల చొప్పున వస్తాయని స్పష్టం చేసింది. మొత్తం180 ప్రశ్నలకు 3 గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.
2021 – 22 విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా విద్యార్ధులకు వెసులుబాటు కల్పించేందుకు నాడు నిర్వహించిన నీట్‌లో ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్ట్‌నూ సెక్షన్ ఏ, బీ అని రెండు భాగాలుగా విభజించి.. సెక్షన్ ఏలోని అన్ని ప్రశ్నలకు, బీలో 15కు గాను 10 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేలా ఆప్షనల్ వెసులుబాటు కల్పించారు. మొత్తం 200 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉండేది. అదనంగా 20 ప్రశ్నలను చేర్చడంతో విద్యార్థులకు 20 నిమిషాలు అదనంగా కేటాయించారు.
అప్పటి నుంచి గతేడాది వరకు ఇదే విధానాన్ని నీట్ యూజీ పరీక్షలో అమలు చేశారు. ఎన్టీఏ తాజా నిర్ణయంతో ఇకపై ఈ విధానం రద్దు కానుంది. అంటే నీట్ యూజీ పరీక్షలో సెక్షన్ బీ విధానం ఉండదు. అలాగే అదనపు సమయం కూడా రద్దు చేశారు. అదనంగా 20 ప్రశ్నలను ప్రవేశపెట్టడంతో విద్యార్థులు 200 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాల్సి వచ్చేది. నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్షలో 180 మార్కులకు 180 ప్రశ్నలకు మూడు గంటల వ్యవధిలో పరీక్ష రాసేలా పాత విధానాన్ని ఎన్టీయే పునరుద్దరించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








