Supreme Court: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో క్యాష్‌ రూపంలో ఫీజు తీసుకోవడం నిషేధం!!

దేశంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో క్యాష్ రూపంలో ఫీజు తీసుకోవడాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం (మే 19) ఉత్తర్వులు జారీ చేసింది..

Supreme Court: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో క్యాష్‌ రూపంలో ఫీజు తీసుకోవడం నిషేధం!!
Supreme Court
Follow us
Srilakshmi C

|

Updated on: May 20, 2022 | 3:36 PM

Charging capitation fee by medical colleges, a matter of concern: దేశంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో క్యాష్ రూపంలో ఫీజు తీసుకోవడాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం (మే 19) ఉత్తర్వులు జారీ చేసింది. కేపిటేషన్‌ ఫీజుల నియంత్రణకు ఈ నిబంధన తప్పనిసరని స్పష్టం చేసంది. కేపిటల్‌ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజుల నియంత్రణ, ప్రవేశాల ప్రక్రియను పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ కోర్టు సహాయకులు చేసిన సిఫార్సులకు ధర్మాసనం ఆమోదముద్ర వేసింది. ఇందులోని కీలక అంశాలు…
  • ప్రైవేటు వైద్య కళాశాలలు కేపిటేషన్‌ ఫీజులు వసూలు చేస్తుంటే… ఆ విషయాన్ని విద్యార్థులు వెల్లడించేందుకు వీలుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలి. ఆ వెబ్‌సైట్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ నిర్వహించాలి.
  • వైద్య కళాశాలల్లో ప్రవేశాల సమయంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ వెబ్‌సైట్‌ వివరాలను స్థానిక వార్తాపత్రికల్లో ఇంగ్లిష్, స్థానిక భాషల్లో ప్రచురించాలి. కేపిటేషన్‌ ఫీజు గురించి సమాచారం అందించేందుకు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉన్న విషయాన్ని కరపత్రాల్లో ముద్రించి, కౌన్సిలింగ్‌ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందించాలి.
  • ప్రవేశ ప్రక్రియ ముగింపు తేదీకి కనీసం రెండు వారాల ముందే అక్కడక్కడ మిగిలిపోయిన సీట్లతోపాటు (స్ట్రే వేకెన్సీ) అన్ని రౌండ్ల కౌన్సిలింగ్‌లు పూర్తయ్యేలా జాతీయ వైద్య, డెంటల్‌ కమిషన్లు ప్రవేశ ప్రక్రియకు సంబంధించి షెడ్యూలును ఖరారు చేయాలి.
  • మిగిలిపోయిన సీట్ల భర్తీకి సిఫార్సు చేసిన అభ్యర్థుల పేర్లు, నీట్‌లో వారికొచ్చిన ర్యాంకు వివరాలను బహిర్గతం చేయాలి. కేవలం ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు పూర్తిచేయాలి.
  • రాష్ట్రాల్లోని ఫీజుల నిర్ధారణ కమిటీ… రుసుములను నిర్ణయించేటప్పుడు ఫీజులోని అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. నిర్ధారిత ఫీజు మినహా, అదనంగా ఒక్క పైసా కూడా వసూలుచేసే అవకాశం యాజమాన్యాలకు ఇవ్వకూడదు.
  • ఒకవేళ కమిటీ ఏదైనా అంశాన్ని విస్మరించిందని చెప్పి, దాని పేరుతో అదనపు ఫీజు వసూలు చేయాలని మేనేజ్‌మెంట్లు భావిస్తే… ఆ విషయాన్ని ఫీజు నిర్ణయ కమిటీ దృష్టికి తీసుకెళ్లి, దాని అనుమతితో మాత్రమే వసూలు చేయాలి.

అఖిల భారత కోటా, రాష్ట్ర కోటా కౌన్సిలింగ్‌ను షెడ్యూలు ప్రకారమే పూర్తిచేసేలా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.