PG Admissions: పీజీ ప్రవేశాలకు కాళోజీ యూవర్సిటీ నోటిఫికేషన్.. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్రంలో పీజీ మెడికల్ ప్రవేశాలకు సంబంధించి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్వీనర్ కోటా కింద ప్రవేశాలు కల్పించేందుకు ఇప్పటికే ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల చేసిన వర్సిటీ నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. మరోవైపు పీజీ ప్రవేశాలకు సంబంధించి వచ్చే నెల 7వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది..
హైదరాబాద్, డిసెంబర్ 31: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి కన్వీనర్ కోటా కింద పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం (డిసెంబర్ 29) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబరు 27న నీట్ పీజీ రాష్ట్ర ర్యాంకులతో ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల చేసిన వర్సిటీ.. డిసెంబరు 28న వరకు అభ్యంతరాలు స్వీకరించింది. కన్వీనర్ కోటాలో మొదటి ఫేజ్ కింద సర్వీస్, దివ్యాంగుల కోటాతోపాటు ఇతర విద్యార్థులు డిసెంబరు 29 సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబరు 31వ తేదీ రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చింది. పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా సీట్లలో సీటు ఖరారైన విద్యార్థులు రూ.29,600 రుసుము ఆన్‌లైన్ ద్వారా చెల్లించి ఎలాట్‌మెంట్ లెటర్ పొందాల్సి ఉంటుంది. ఇక ట్యూషన్ ఫీజు ఆయా కాలేజీల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఇందుకు సంబంధించి విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 93926 85856, 78421 36688, 90596 72216 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని వర్సిటీ అధికారులు సూచించారు. అభ్యర్థుల ప్రవేశాలు, కాలేజీల్లో సీట్ల ఖరారు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడే ఉంటుందని కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పీజీ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన 148, 149 జీవోలపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆ జీవోలను కొట్టేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జనవరి 7న విచారణ జరగాల్సి ఉంది. మరోవైపు బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీహెచ్‌ఎంఎస్ ప్రవేశాలకు కన్వీనర్ కోటా కింద స్పాట్ కౌన్సెలింగ్‌కు కూడా కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
జనవరి 2న సీటెట్ 2024 ఆన్సర్ కీ విడుదల.. త్వరలో ఫలితాలు
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ 2024 ఆన్సర్ కీ రేపు విడుదలవనుంది. ప్రాథమిక కీతోపాటు పరీక్షపత్రం, రెస్పాన్స్‌షీట్‌లను జనవరి 1 లేదా 2వ తేదీన విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చేవారం తొలి రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా సీటెట్ పరీక్ష డిసెంబర్ 14వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన సంగతి తెలిసిందే.