AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC: ‘అన్ని పోటీ పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలి’ ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీ నివేదిక

ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. కమిషన్ ఆధ్వర్యంలో జరిగే అన్ని పరీక్షలను ఆఫ్ లైన్ లోనే నిర్వహించాలని, అలాగే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కమిషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని సూచించింది. ఇంకా..

APPSC: ‘అన్ని పోటీ పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలి' ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీ నివేదిక
APPSC Reforms Committee
Srilakshmi C
|

Updated on: Dec 30, 2024 | 11:30 AM

Share

అమరావతి, డిసెంబర్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో నియామక పరీక్షలన్నింటినీ ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో సూచించింది. ప్రభుత్వశాఖల్లో పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయని, ఇకపై అలా జరగడానికి వీలులేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మొత్తం 272 రకాల పోస్టులను నాన్‌ టెక్నికల్, టెక్నికల్‌ సర్వీసెస్‌ కేటగిరీలుగా విభజించి, నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. నాన్‌-టెక్నికల్‌ విభాగంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, సర్వీసెస్‌ పోస్టులను చేర్చింది. టెక్నికల్‌ సర్వీసెస్‌లో ఏ, బీ, సీ కేటగిరీల కింద ఇంజినీరింగ్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఉంచాలని సూచించింది. ఏపీ టీచింగ్‌ సర్వీసెస్‌లో ఏ, బీ కేటగిరీల వారీగా, ఏపీ టెక్నికల్‌ సర్వీసెస్‌లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ప్రస్తుతం గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, జేఎల్‌- డీఎల్ అధ్యాపకులు, ఇంజినీరింగ్, ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ వేర్వేరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాలు, పరీక్షా విధానం, ప్రతిపాదనల్లో ఉన్న పోస్టుల రీ-గ్రూపింగ్, ఇతర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. ఇందుకోసం ఢిల్లీలోని యూపీఎస్సీ, రాజస్థాన్, కేరళ, బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లను సందర్శించి, అక్కడి కార్యకలాపాల తీరును సమీక్షించింది. వీటి ఆధారంగా ఏపీపీఎస్సీలో తీసుకురావాల్సిన సంస్కరణలపై తుది నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

అలాగే ప్రతి ఏడాది ‘ప్యానల్‌ ఇయర్‌’ను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని, దాని ప్రకారం ఆగస్టు 31నాటికి ప్రభుత్వ శాఖల యూనిట్‌ ఆఫీసర్లు ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలని పేర్కొంది. మంజూరైన పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి లేకుండానే జూన్‌ నుంచి కసరత్తు ప్రారంభించాలని, ఇందుకు అనుగుణంగా ఏపీపీఎస్సీ ‘జాబ్‌ క్యాలెండర్‌’ను ఖరారు చేయాలని సూచించింది. మరుసటి సంవత్సరం డిసెంబరులోగా ఆయా నియామకాలు పూర్తి కావాలని తెలిపింది. ఇక కమిషన్‌ ఎంపికచేసే అభ్యర్థులకు మార్చిలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని నివేదికలో పేర్కొంది. మౌఖిక పరీక్షలో మార్కులు 80% దాటితే కారణాలు రికార్డులో నమోదుచేయాలని, మౌఖిక పరీక్షకు 15 నిమిషాల ముందే పాల్గొనేవారికి ఏ బోర్డుకు వెళ్లాలో చెప్పేలా సాఫ్ట్‌వేర్‌ ర్యాండమైజేషన్‌ విధానాన్ని తీసుకురావాలని సూచించింది. అనంతరం మెయిన్, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్‌ జాబితా ప్రకటించాలి. ఈ విధానాల ద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది. కాగా ఈ సంస్కరణల కమిటీకి వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఛైర్మన్‌గా, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ కన్వీనర్‌గా ఉన్నారు. మరో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు సభ్యులుగా ఇందులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.