JEE Main 2025 Exam: ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు.. 14 లక్షల మంది విద్యార్ధులకు అగ్నిపరీక్ష
NIT, IITల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 14 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే లక్షన్నర మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందులో వచ్చి న ర్యాంకు ఆధారంగా బీఈ, బీటెక్ కోర్సుల్లో సీట్లు దక్కుతాయి..

హైదరాబాద్, జనవరి 22: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2025 తొలివిడత ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం (జనవరి 22) నుంచి ప్రారంభంకానున్నాయి. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తారు. ఇక చివరి రోజు జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 జరీక్ష జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ రెండు పేపర్లకు కలిపి దాదాపు 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు లక్షన్నర మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు.. ఇలా రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని నగరాలతోపాటు పలు పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు సీట్లు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8500 సీట్లు, ఇతర విద్యాసంస్థల్లో 57 వేల సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ జేఈఈ మెయిన్ రాసిన ప్రతి వంద మందిలో నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతాయి.
కొత్తగా బీఏ డిఫెన్స్, సెక్యూరిటీ స్టడీస్ కోర్సు ప్రవేశ పెట్టనున్న ఉన్నత విద్యామండలి
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి బీఏలో మరో కొత్త కోర్సు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బీఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అనే కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సిలబస్ రూపొందిస్తున్నామని, తర్వాత కాలేజీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. రక్షణ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్నందున ఆ కోర్సును ప్రవేశపెడుతున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.