Intelligence Bureau Jobs 2025: టెన్త్ అర్హతతో.. ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..! తెలుగు రాష్ట్రాల్లో పోస్టులెన్నంటే..
ఇంటలిజెన్స్ బ్యూరో (IB)లో ఇటీవల అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా భారీగా నియామకాలకు మరో నోటిఫికేషన్ జారీ చేసింది. పదో తరగతి అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ (SA/Exe) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో (IB)లో ఇటీవల అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా భారీగా నియామకాలకు మరో నోటిఫికేషన్ జారీ చేసింది. పదో తరగతి అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ (SA/Exe) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇంటలిజెన్స్ బ్యూరోకి అనుబంధంగా ఉన్న 37 బ్రాంచుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. వీటిల్లో హైదరాబాద్‌లో 117 పోస్టులు, విజయవాడలో 115 పోస్టులున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 26, 2025 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు..
- జనరల్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 2,471
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 501
- ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 1015
- ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 574
- ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 426
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసులై ఉండాలి. అభ్యర్ధుల వద్ద తప్పనిసరిగా నివాస ధ్రువీకరణ పత్రం సర్టిఫికేట్ ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్రంలో ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 17 ఆగస్టు 2025 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితో సడలింపు ఉంటుంది. ఇంటెలిజెన్స్ పనిలో ఫీల్డ్ అనుభవం ఉంటే ప్రాధాన్యం ఉంటుంది.
ఈ అర్హతలున్న వారు ఆగస్టు 17, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు రూ.550 ఫీజుగా చెల్లించాలి. ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ (టైర్ 1), డిస్క్రిప్టివ్ టెస్ట్ (టైర్ 2), ఇంటర్వ్యూ (టైర్ 3) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 జీతంతోపాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఎంపిక విధానం ఇలా..
టైర్ 1 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష గంట వ్యవధిలో జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి ¼ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్ 2 పరీక్ష భాషా అనువాదం డిస్క్రిప్టివ్ టెస్ట్ విధానంలో ఉంటుంది. ఇది 50 మార్కులకు ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఈ పరీక్ష కూడా గంట వ్యవధిలో ఉంటుంది. ఇక టైర్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది 50 మార్కులకు ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




