TG Gurukula Admissions: ఇకపై ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా గురుకులాల్లో ఇంటర్‌, డిగ్రీ ప్రవేశాలు

పేదింటి విద్యార్ధులకు మూడు పూటలా అన్నం పెట్టి, కట్టుకోవడానికి బట్టలిచ్చి విద్యాబుద్ధులు నేర్పి.. ప్రయోజకులను చేసే గురుకులాలు ఎన్నో యేళ్లుగా ఎందరో విద్యార్ధులకు జీవితాలను ఇచ్చాయి. అయితే గత కొంత కాలంలో గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఇకపూ పూర్తిగా సీట్లు భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది..

TG Gurukula Admissions: ఇకపై ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా గురుకులాల్లో ఇంటర్‌, డిగ్రీ ప్రవేశాలు
Gurukula Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 25, 2024 | 9:03 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సరికొత్త విధానానికి నాంది పలకనుంది. ఇకపై పది పాసైతే చాలు నేరుగా గురుకుల సొసైటీలు ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించనున్నాయి. అలాగే బ్యాక్‌లాగ్‌ ఖాళీల సమస్య లేకుండా చర్యలు చేపట్టాయి. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాయి. ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండానే నేరుగా గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు కల్పిస్తాయి. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్లు కల్పిస్తారు. అనంతరం ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరించి బ్యాక్‌లాగ్‌లు లేకుండా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ దిశగా ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీలో ఇంటర్‌ ప్రవేశాలకు చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇవ్వడంతో అన్ని గురుకులాల్లో అమలుచేయాలని సొసైటీలు నిర్ణయించాయి.

బీసీ గురుకులాల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నేరుగా ఇంటర్‌ ప్రవేశాలు కల్పిస్తామని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలోని వెయ్యి గురుకుల పాఠశాలలు ఇంటర్మీడియట్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ఇంటర్‌ ఫస్టియర్‌లో 80 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు గురుకుల సొసైటీలు ఇంటర్‌ ప్రవేశాలకు వేర్వేరుగా ప్రవేశపరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేవారు. నాలుగైదేళ్ల క్రితం ఇంటర్‌ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో, డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. రెండేళ్ల క్రితం సీట్ల సంఖ్య పెరిగాయి. దీంతో గురుకుల సొసైటీల్లో ఇంటర్‌లో 30 శాతం, గురుకుల డిగ్రీ కాలేజీల్లో సగానికిపైగా సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. స్పాట్‌ అడ్మిషన్లు ఆలస్యంగా చేపట్టడంతో సీట్లు ఆశించినవారికి సకాలంలో దొరకడం లేదు. అక్కడే టెన్త్‌ పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు లేకపోవడంతో వారంతా ప్రభుత్వ కాలేజీలకు వెళ్తున్నారు.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ)ల్లో మినహా మిగతా గురుకులాల్లో నీట్, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు శిక్షణ లేదు. దీంతో ఆయా గురుకులాల్లో విద్యార్ధులు ప్రవేశాలకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో వెయ్యి గురుకులాలుంటే.. సీవోఈల సంఖ్య 50 మాత్రమే. ఈ పరిస్థితిని అంచనావేసిన సొసైటీలు సీవోఈల సంఖ్య పెంచాలని, పదోతరగతి పూర్తిచేసిన వారికి నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించాయి. ఇక ఎస్సీ గురుకుల సొసైటీల్లో పదోతరగతి పూర్తయిన వారికి నేరుగా అక్కడే ఇంటర్‌ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ విద్యార్థులు చేరగా మిగిలిన సీట్లకు బయటి విద్యార్ధులను తీసుకుంటున్నారు. టెన్త్‌లో ‘10/10’ పాయింట్లు సాధించిన విద్యార్థులకు నేరుగా సీవోఈల్లో ప్రవేశాలు కల్పించింది. గిరిజన, బీసీ గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో డిగ్రీలోనూ నేరుగా ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వివరాల కోసం క్లిక్‌ చేయండి.