AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Paper Leak: పేపర్ లీకులతో NEET ఆలస్యం.. ప్రవేశాల కౌన్సెలింగ్‌లన్నీ అస్తవ్యస్తం! గాడి తప్పుతున్న విద్యాసంవత్సరం

వరుస పేపర్‌ లీకేజీలతో యేటా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ప్రశ్నా్ర్ధకంగా మారుతున్నాయి. ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా సాగితినే రాష్ట్రంలో పలు ప్రవేశాల కౌన్సెలింగ్‌లు ఆలస్యమవుతున్నాయి. తరచూ నీట్‌ పేపర్‌ లీకులతో యేటా కొత్త విద్యాసంవత్సరాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. దీంతో వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ఆలస్యంగా మొదలవుతుంది.

NEET Paper Leak: పేపర్ లీకులతో NEET ఆలస్యం.. ప్రవేశాల కౌన్సెలింగ్‌లన్నీ అస్తవ్యస్తం! గాడి తప్పుతున్న విద్యాసంవత్సరం
NEET paper leak impact on admissions
Srilakshmi C
|

Updated on: May 15, 2026 | 5:45 PM

Share

హైదరాబాద్‌, మే 15: నీట్‌ కౌన్సెలింగ్‌ తర్వాతే పలు ఇతర కోర్సుల ప్రవేశాలు జరపాల్సి ఉండటంతో యేటా విద్యా సంవత్సరం గాడి తప్పుతోంది. ఈ క్రమంలో ఈఏపీసెట్‌ ఫలితాలు మే నెలలోనే వెలువడినా ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబరు వరకు వేచి చూడాల్సి వస్తోంది. అన్ని పరీక్షలు సకాలంలో పూర్తయితేనే ఈఏపీసెట్ పరిస్థితి ఇలా ఉంది. ఇక ఈ ఏడాది నీట్‌ పరీక్ష రద్దు అవడంతో పలు ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

గత ఏడాది మే 4న నీట్‌ నిర్వహించగా.. జూన్‌ 14న ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా నీట్‌ ర్యాంకు ఆధారంగా రాష్ట్ర ర్యాంకు కేటాయిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. రాష్ట్ర నీట్‌ కౌన్సెలింగ్‌ రెండు, మూడు దఫాలు పూర్తయిన తర్వాత ఈఏపీసెట్ అగ్రికల్చర్‌ విభాగం ప్రవేశాలు మొదలుపెడుతుంది. కాళోజీ హెల్త్‌ వర్సిటీల ఆధ్వర్యంలో తొలుత నీట్‌ కౌన్సెలింగ్‌ ఆ తర్వాత వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు జరుపుతారు. చివరగా బీఫార్మసీ, ఫార్మా-డి కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. గత ఏడాది నీట్‌ సవ్యంగా జరిగితేనే ఫార్మా కౌన్సెలింగ్‌ అక్టోబరు 5న మొదలైంది. చివరి విడత కౌన్సెలింగ్‌ అక్టోబరు 23తో పూర్తయింది. ఈ సారి నీట్‌ రద్దు కావడంతో ఈ ప్రవేశాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక బీ ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులకైతే నవంబరు వరకు ప్రవేశాలకు ఎదురు చూడాల్సిందే.

ఈ కౌన్సెలింగ్‌లు అన్నీ ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉండటంతోనే ఈ జాప్యం నెలకొంటుంది. ఒక కోర్సులో చేరిన తర్వాత డిమాండ్‌ ఉన్న మరో కోర్సులో సీటు వస్తే.. తొలుత సీటు పొందిన కాలేజీలు ఫీజు, సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వడం లేదు. దీంతో ఆ ఫీజును వదులు కోవడమో.. మెరుగైన సీటు కోల్పోవడమో జరుగుతుంది. అందుకే విద్యాశాఖ అధికారులు సైతం ఒక కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత మరొకటి నిర్వహిస్తూన్నారు. ఈసారి మళ్లీ నీట్‌ నిర్వహించి, ఫలితాలు వెల్లడించడానికి కనీసం 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా చూస్తే ప్రవేశాల కౌన్సెలింగ్‌లు మరింత ఆలస్యమవుతాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే తప్ప కొత్త విద్యాసంవత్సరం కొలిక్కిరాదని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us