TGPSC Group 1 Hall Tickets: తెలంగాణ గ్రూప్ 1 హాల్‌టికెట్లలో స్వల్పమార్పులు.. ‘మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండి’
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) స్వల్ప మార్పులు చేసింది. అందులో కొత్తగా కుల ధృవీకరణకు సంబంధించిన క్రీమీలేయర్, నాన్‌క్రీమీలేయర్..
హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) స్వల్ప మార్పులు చేసింది. అందులో కొత్తగా కుల ధృవీకరణకు సంబంధించిన క్రీమీలేయర్, నాన్‌క్రీమీలేయర్, ఈడబ్ల్యూఎస్ వివరాలను పొందుపరిచింది. ఈ మేరకు సవరించిన హాల్‌టికెట్లను జూన్ 3న మధ్యాహ్నం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్లలో మార్పులు చేసిన విషయాన్ని టీజీపీఎస్సీ అభ్యర్థులకు మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలిపింది. అయితే పరీక్ష కేంద్రం, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్ష సమయం, తేదీ వంటి వివరాల్లో ఎలాంటి మార్పు చేయలేదని కమిషన్ స్పష్టం చేసింది. తాజా మార్పుల దృష్ట్యా సవరించిన హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, వాటినే పరీక్ష రోజున ఎగ్జాం సెంటర్లకు తీసుకురావాలని కమిషన్ సూచించింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్లలో చోటు చేసుకున్న మార్పులివే..
జూన్ 1వ తేదీన విడుదలైన హాల్‌టికెట్లలో కులవివరాలు ఉన్నప్పటికీ క్రీమీలేయర్, నాన్‌క్రీమీలేయర్ వివరాలు అందులో పేర్కొనలేదు. మెయిన్స్, ఇంటర్వ్యూల వరకు ప్రిలిమినరీ హాల్‌టికెట్ కీలకమని.. దీన్ని తుది నియామకాల వరకు భద్రపరచుకోవాలని టీజీపీఎస్సీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అలాగే గ్రూప్-1 ప్రిలిమినరీ హాల్‌టికెట్‌పై గత మూడునెలల్లో తీసుకున్న పాస్‌పోర్టు ఫొటోను మాత్రమే అతికించి, పరీక్షకు వచ్చే ముందుగానే ఫొటో అతికించాలని పేర్కొంది. హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకాన్ని ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాలన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే హాల్‌టికెట్‌పై ముద్రించిన నిబంధనల్లో స్పష్టం చేశామని, ఆ వివరాలను అభ్యర్థులు చదువుకోవాలని సూచించింది. అలాగే ఫొటో ఐడెంటిటీ కోసం పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపుకార్డును తప్పని సరిగా పరీక్ష కేంద్రం వద్ద ఉండే సిబ్బందికి చూపించాలని కోరారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.