AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎయిర్‌ షోలో అపశృతి.. గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు! వీడియో వైరల్‌

పోర్చుగల్‌లోని బెజా ఎయిర్‌పోర్టులో ఆదివారం (జూన్‌ 3) జరిగిన ఎయిర్‌ షోలో విషాదం చోటుచేసుకున్నది. గాల్లో ఉండగా రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్‌ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. దక్షిణ పోర్చుగల్‌లోని బెజా విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం 4.05 గంటలకు ఎయిర్‌ షో..

Watch Video: ఎయిర్‌ షోలో అపశృతి.. గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు! వీడియో వైరల్‌
Beja Air Show Accident
Srilakshmi C
|

Updated on: Jun 03, 2024 | 4:19 PM

Share

లిస్బన్, జూన్‌ 3: పోర్చుగల్‌లోని బెజా ఎయిర్‌పోర్టులో ఆదివారం (జూన్‌ 3) జరిగిన ఎయిర్‌ షోలో విషాదం చోటుచేసుకున్నది. గాల్లో ఉండగా రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్‌ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. దక్షిణ పోర్చుగల్‌లోని బెజా విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం 4.05 గంటలకు ఎయిర్‌ షో ప్రారంభమైంది. ఈ షోలో డజన్ల కొద్ది మిలటరీ విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రమంలో ఆరు విమానాలు గాల్లో ప్రదర్శన చేశాయి. వీటిల్లో పోర్చుగ్రీసు, స్పానిష్‌ పైలట్లు ఉన్నారు. అయితే అందులో ఓ విమానం మరో విమానాన్ని గాల్లోనే ఢీకొట్టింది. దీంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన పైలట్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. పోర్చుగల్‌ జాతీయుడైన మరో పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నేపథ్యంలో ఈ షో ప్రారంభమైన కాసేపటికే తాత్కాలికంగా నిలిపివేసినట్లు వైమానిక దళం తెలిపింది.

గాయపడిన పైలట్‌ను వెంటనే బెజా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినట్లు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు తరలించారు. ఈ షోలో పాల్గొన్న 6 విమానాలు యాక్‌ స్టార్స్‌ అనే ఏరోబాటిక్‌ గ్రూప్‌కు చెందినవిగా వైమానిక దళం తెలిపింది. ఇక ప్రమాదానికి గురైన విమానాలు యాకొవెల్వ్‌ యాక్‌-52గా పేర్కొన్నారు. ఇవి సోవియట్‌ డిజైన్డ్‌ ఏరోబేటిక్‌ ట్రైనింగ్‌ మోడల్‌కు చెందినవని తెలిపారు. ‘యాక్ స్టార్స్’కు చెందిన విమానాలు ఇప్పటి వరకు దాదాపు 30 యూరోపియన్ ఏరోబాటిక్ గ్రూపులలో పనిచేశాయి. ఇది దక్షిణ యూరప్‌లోని అతిపెద్ద సివిల్ ఏరోబాటిక్స్ గ్రూప్‌.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ప్రమాదంపై పోర్చుగల్‌ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోషం కోసం ఏర్పాటు చేసిన ఎయిర్‌ షో విషాదంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. పోర్చుగల్ రక్షణ శాఖ మంత్రి నునో మెలో ట్రాజెడీగా అభివర్ణించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌ షోను వీక్షించేందుకు వచ్చిన ఓ ప్రేక్షకుడు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ఢీకొన్న విమానం ఎయిర్‌ బేస్‌ మైదానంలో కుప్పకూలడం కనిపిస్తుంది. ప్రమాదానికి గురైన రెండో విమానం ఎయిర్‌పోర్ట్‌ టార్మాక్‌పై ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.