SSC Supplementary Exams 2025: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?
పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్ విడుదల చేసింది..

అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పది పరీక్షల్లో తప్పిన విద్యార్ధులతోపాటు మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు విద్యాశాఖ అవకాశం కల్పించింది. పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లో వారివారి స్కూల్ లాగిన్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్ధులు రీకౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇక పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్ విడుదల చేసింది. విద్యార్థులు ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా తాజాగా విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ఇదే..
- మే 19- ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
- మే 20- సెకండ్ ల్యాంగ్వేజ్
- మే 21- ఇంగ్లీష్
- మే 22- గణితం
- మే 23- భౌతిక శాస్త్రం
- మే 24- జీవ శాస్త్రం
- మే 26- సామాజిక అధ్యయనాలు
- మే 27- ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ I
- మే 28- OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, SSC ఒకేషనల్ కోర్సు
ఏపీలో ఓపెన్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేలోనే..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కూడా వచ్చేశాయ్. 26,679 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. వారిలో 10,119 మంది అంటే 37.93 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్మీడియట్‌లో 63,668 మందికి గాను 33,819 మంది అంటే 53.12 శాతం విజయం సాధించాడు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 26 నుంచి మే 5 వరకు ఏపీ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి సబ్జెక్టు రీకౌంటింగ్‌కు రూ.200, రీ వెరిఫికేషన్ కు రూ.రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పది, ఇంటర్ మే 2025 పరీక్షలు రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతోపాటు కలిపి నిర్వహించనున్నట్టు తెలిపారు.




