AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2025 Postings: ఇవాళ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి

Distribution of AP Mega DSC 2025 appointment letters: అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో నేడు డీఎస్సీ విజేతలకు నియమాక పత్రాలు అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం..

AP Mega DSC 2025 Postings: ఇవాళ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి
Distribution of AP Mega DSC appointment letters
Srilakshmi C
|

Updated on: Sep 25, 2025 | 7:31 AM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 25: రాష్ట్రచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అతిపెద్ద డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం… ఈ రోజు (సెప్టెంబర్ 25) విజేతలకు నియమాక పత్రాలు అందించనుంది. అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు గత ఏడాది బాధ్యతలు చేపట్టిన వెంటనే జూన్‌ 13, 2024న మెగా డిఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అన్ని అవాంతరాలను అధిగమించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ క్రతువును విజయవంతంగా ముందుకు నడిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఒకసారి చరిత్రను పరిశీలిస్తే డిఎస్సీల ఛాంపియన్ చంద్రబాబు నాయుడేనని స్పష్టమవుతుతోంది.

1994 నుంచి 2025 వరకు గత 31సంవత్సరాల్లో 14 డీఎస్సీలను ప్రకటించడం ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం, కూటమి ప్రభుత్వాలకే దక్కుతుంది. అయిదేళ్ల పాలనలో గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీచేయలేదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. దీనిపై మొత్తం 106 కేసులు దాఖలు చేశారు. అయితే మొదటి నుంచి ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉన్న మంత్రి లోకేష్… అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ (ఏప్రిల్ 20, 2025) విడుదల చేశాక కేవలం 150 రోజుల వ్యవధిలో నియామక ప్రక్రియను పూర్తిచేసి… రికార్డు సృష్టించారు. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా… ఎంపికైన 15,941 మందికి గురువారం నియాపక పత్రాలు అందజేయనున్నారు.

మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మెగా డిఎస్సీ ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి విమర్శలకు తావులేకుండా అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 5.3లక్షలమంది అభ్యర్థులు మెగా డిఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా డిఎస్సీ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం… ఆ తర్వాత కీ, మెరిట్ జాబితాను ఆన్ లైన్ లో ప్రచురించారు. అన్నిస్థాయిలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుచేసి సమర్థవంతంగా ఫిర్యాదులను పరిష్కరించారు. ఎస్సీ వర్గీకరణతోపాటు తొలిసారిగా 3శాతం క్రీడాకోటాను కూడా అమలుచేశారు. క్రీడా కోటా ద్వారా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడా కోటా సహా అన్ని కేటగిరిల్లో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలుచేశారు. ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీచేస్తామని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం డిఎస్సీలో మిగిలిపోయిన 406 పోస్టులతోపాటు కొత్తగా ఖాళీ అయ్యే పోస్టులతో వచ్చే ఏడాది మరో డిఎస్సీ ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత మెగా డిఎస్సీలో అత్యధికంగా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో 2590 టీచర్ పోస్టులను భర్తీచేశారు. మెగా డిఎస్సీ -2025లో ఎంపికైన 15,941మంది అభ్యర్థుల్లో 7,955 మంది (49.9%) మహిళలు కాగా, 7,986 మంది (50.1%) పురుషులు ఉన్నారు. పురుషులతో సమానంగా దాదాపు 50శాతం మంది మహిళలు ఎంపిక కావడం ఈ డిఎస్సీలో మరో విశేషం. సచివాలయం సమీపంలోని ప్రాంగణంలో మెగా డిఎస్సీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సబ్జెక్టుల వారీగా రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలచిన 16 మంది, ఆరుగురు ఇన్ స్పైర్ విజేతలకు కలసి 22 మందికి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతులమీదుగా నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలిన వారికి ప్రాంగణంలోనే అధికారులు నియమాక పత్రాలు ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేశారు.

ప్రాంగణంలో అభ్యర్థులు, వారితోపాటు వచ్చే కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం మొత్తం 34వేల సీటింగ్ తో కుర్చీలు ఏర్పాటుచేశారు. రాయలసీమ, దక్షిణ కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారీగా ప్రాంగణంలో నాలుగుజోన్లు ఏర్పాటు చేశారు. ఇందులో మళ్లీ జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సబ్ జోన్లు ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పాఠశాల విద్యాశాఖ తరపున ఒక ఇన్ ఛార్జి ని నియమించారు. ఆయా జిల్లాల్లో ఎంపికైన నాన్ లోకల్ అభ్యర్థుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటుచేశారు. రాయలసీమ అభ్యర్థులు ప్రత్యేక బస్సుల ద్వారా ఈ రాత్రికి గుంటూరు చేరుకొని, రేపు మధ్యాహ్నం ప్రాంగణానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల వాసులకు విజయవాడలో బస ఏర్పాటుచేశారు. రేపు అక్కడనుంచి వారు ప్రాంగణానికి చేరుకుంటారు. నియమాక పత్రాల అందజేతతోపాటు చివరి అభ్యర్థి వరకు క్షేమంగా స్వస్థలాలకు చేర్చేలా పాఠశాల విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.