AP Govt Schools: ఇక పుస్తకాల మోతకు గుడ్‌బై.. పాఠశాల విద్యలోనూ సెమిస్టర్ విధానం షురూ!
2025-26 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు పుస్తకాల మోత తగ్గించేందుకు కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల స్థాయిలోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా చేస్తుంది. ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించేందుకు చర్యలు చేపట్టింది..

అమరావతి, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల మోత తగ్గించేందుకు విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల స్థాయిలోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయనుంది. దీంతో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగత వరకు విద్యార్థులందరికీ సెమిస్టర్ల వారీగా పాఠ్యపుస్తకాలు అందించనుంది. మొదటి సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను బడులు తెరిచిన తర్వాత జూన్‌లో ఇస్తారు. మొదటి సెమిస్టర్ పూర్తయ్యాక రెండో సెమిస్టర్ పుస్తకాలు కూడా అందజేస్తారు. సెమిస్టర్ విధానం వల్ల ఒకటి, రెండు తరగతుల విద్యార్ధులకు కేవలం రెండు పుస్తకాలే ఉంటాయి. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లతో కలిపి మొత్తం ఆరు పుస్తకాలు ఇచ్చేవారు. విద్యాశాఖ తాజా నిర్ణయంతో తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్య పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా, వీటికి సంబంధించిన వర్క్‌బుక్‌లను మరొక పుస్తకంగా ఇస్తారన్నమాట. ఈ రెండు పుస్తకాలు రెండు సెమిస్టర్లుగా విద్యార్థులకు అందిస్తారు.
ఇక మూడు, నాలుగు, ఐదు తరగతులకు నాలుగు పాఠ్యపుస్తకాల చొప్పున అందిస్తారు. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు కలిపి ఒకటి, గణితం, ఈవీఎస్ కలిపి మరొకటి ఉంటుంది. ఇక వీటికి వర్క్‌బుక్‌లను మరో రెండు ఇస్తారు. ఇలా చేయడం ద్వారా విద్యార్ధులకు పుస్తకాల మోత భారీగా తగ్గనుంది. అటు ఆరు నుంచి 9వ తరగతి వరకు కూడా విద్యార్ధుల పాఠ్యపుస్తకాలను భారీగా తగ్గించారు. తెలుగు, ఆంగ్లం, హిందీలకు కలిపి ఒకే పుస్తకంగా రానుంది. మిగతావి మాత్రం సబ్జెక్టు వారీగా విడివిడిగా అందిస్తారు. అంతేకాకుండా అన్ని తరగతుల పుస్తకాల సైజు కూడా బాగా తగ్గింది. ముఖ్యంగా లాంగ్వేజ్ పుస్తకాలన్నీ ఒకే పుస్తకంగా రావడంతో బరువు చాలా వరకు తగ్గింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాల ప్రకారం సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు మోడల్ విద్యను ప్రవేశపెట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 10 వేల వరకు మొడల్ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. పిల్లల ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు కూడా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలనే ఇవ్వాలని నిర్ణయించింది. ఉపాధ్యాయుల బదిలీలకు కొత్త చట్టం తీసుకురావడంతోపాటు ఉపాధ్యాయుల సర్వీసు వివరాలను ఆన్‌లైన్ చేసింది. తద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ఇదే ప్రామాణికంగా మారనుంది. అలాగే వచ్చే ఏడాది పాఠశాలల్లో లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను తీసుకొస్తున్నారు. ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులను విద్యావిధానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభంకానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.