IIT Madras: ఇక ఐఐటీ మద్రాస్‌లో కొత్త కోర్సులు.. జాబ్ గ్యారెంటీ పక్కా మరి!
ఐఐటీ మద్రాస్ తాజాగా స్వయం ప్లస్‌లో ఉపాధి-కేంద్రీకృత కోర్సులను అందించడానికి పరిశ్రమలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలతో (HEIs) భాగస్వామ్యం కుదుర్చుకుంది. విద్యార్ధులు తమ పాఠ్యాంశాల్లో భాగంగా స్వయం ప్లస్ కోర్సులను చదివేలా కార్యచరన రూపొందిస్తున్నారు. ఇందులో విద్యార్ధులకు పరిశ్రమ-నిర్దిష్ట నైపుణ్యాలు, ఉపాధిపై దృష్టి సారించే కోర్సులను అందిస్తారు. ఈ కోర్సులు పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి..

న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలోని ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారన్న సంగతి తెలిసిందే. అయితే దేశంలోనే టాప్ ఐఐటీ సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) మరో వినూత్న కార్యక్రమానికి తెర దించింది. తాజాగా స్వయం ప్లస్‌లో ఉపాధి-కేంద్రీకృత కోర్సులను అందించడానికి పరిశ్రమలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలతో (HEIs) భాగస్వామ్యం కుదుర్చుకుంది. విద్యార్ధులు తమ పాఠ్యాంశాల్లో భాగంగా స్వయం ప్లస్ కోర్సులను చదివేలా కార్యచరన రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో స్వయం ప్లస్ కోర్సుల్లో చేరేందుకు 2500 మందికి పైగా అభ్యర్ధులను తీసుకోనుంది. అలాగే స్వయం ప్లస్ కోర్సులు తీసుకునే వివిధ సంస్థల నుంచి పది వేలకుపైగా విద్యార్థుల నమోదును లక్ష్యంగా చేసుకుంది.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరిగిన ఐఐఎన్‌వెన్‌టివ్ 2025 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విద్య, అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి, ఐఐటీ మద్రాస్ & స్వయం ప్లస్ కోఆర్డినేటర్ డీన్ (ప్లానింగ్) ప్రొఫెసర్ ఆర్ సారథి ఇతర భాగస్వాముల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పరిశ్రమలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు స్వయం ప్లస్ పోర్టల్‌లో ఉపాధి-కేంద్రీకృత కోర్సులను అందించడానికి వీలు కల్పిస్తాయి. ఇందుకు వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్, NSE అకాడమీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలతో అభ్యాసకులను సన్నద్ధం చేయడం ద్వారా వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం జరుగుతుంది.
ఇందులో విద్యార్ధులకు పరిశ్రమ-నిర్దిష్ట నైపుణ్యాలు, ఉపాధిపై దృష్టి సారించే కోర్సులను అందిస్తారు. ఈ కోర్సులు పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. విద్యార్ధులు ఆచరణాత్మక, కెరీర్-సంబంధిత అంశాలను నేర్చుకునేందుకు ఈ కోర్సులు సహాయపడతాయి. ఈ కోర్సులకు IIT మద్రాస్‌లోని ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఆమోదం లభించిన తర్వాత మాత్రమే SWAYAM ప్లస్‌లో చేర్చబడతాయి. స్వయం కోర్సులలో విద్యార్థుల నమోదును పెంచడం, స్వయం ప్లస్‌ను దేశంలో నైపుణ్య ఆధారిత అభ్యాసానికి వేదికగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి స్వయం ప్లస్‌లో 50కి పైగా పరిశ్రమల నుంచి 350 కోర్సులను అందిస్తోంది. SWAYAM ప్లస్ కోర్సులను విద్యార్ధుల పాఠ్యాంశాల్లో అనుసంధానించడంతోపాటు మూల్యాంకనం, క్రెడిట్స్ కూడా ఇస్తారు. ఈ ఒప్పందాలపై సత్యబామ యూనివర్సిటీ, త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, వినాయక మిషన్స్ లా స్కూల్ తదితర సంస్థలు సంతకం చేశాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.