Schools Reopen: వేసవి సెలవులు అయిపోయాయ్.. రేపట్నుంచి మోగనున్న బడిగంటలు
రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. అన్ని పాఠశాలలు గురువారం (జూన్ 12) నుంచి తెరుచుకోనున్నాయి. మరోవైపు వేసవి ఎండలు తగ్గి చిటపట చినుకులు కూడా ప్రారంభమైనాయి. దీంతో ఎప్పటిలాగానే బడి గంటలు ఉదయాన్నే మోగనున్నాయి..

అమరావతి, జూన్ 11: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు నేటితో వేసవి సెలవులు ముగియనున్నాయి. దీంతో రేపటి నుంచి రెండు రాష్ట్రాల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. అన్ని పాఠశాలలు గురువారం (జూన్ 12) నుంచి తెరుచుకోనున్నాయి. మరోవైపు వేసవి ఎండలు తగ్గి చిటపట చినుకులు కూడా ప్రారంభమైనాయి. దీంతో ఎప్పటిలాగానే బడి గంటలు ఉదయాన్నే మోగనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజులపాటు సెలవులు ఎంజాయ్ చేసిన పిల్లలు బడికి బయల్దేరే సమయం ఆసన్నమైంది. దీంతో సెలవుల్లో హాయిగా, ఆనందంగా గడిపిన చిన్నారులు భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్లేందుకు అమ్మమ్మ, నానమ్మల ఊర్ల నుంచి తల్లిదండ్రుల వద్దకు వస్తున్నారు. ఇక విద్యార్ధుల తల్లిదండ్రులు పిల్లలకు బ్యాగులలు, పుస్తకాలు, పెన్నులు, టిఫిన్ బాక్స్‌లు, పెన్సిల్‌లు కొనేందుకు బిజీగా మారారు.
మరోవైపు సర్కార్ బడులు విద్యార్థులను ఘనంగా ఆహ్వానించేందుకు రెండు రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే జూన్ 12వ తేదీన బడులు తెరచిన మొదటి రోజే విద్యార్ధి మిత్ర కిట్లను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అలాగే తల్లికి వందనం పథకం కింద విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు కూడా జూన్ 12వ తేదీనే జమ చేయనుంది.
ఈ మేరకు ఇప్పటికే ప్రకటనలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో తరగతి గదులను ప్రత్యేకంగా డెకరేషన్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలంగాణలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచేందుకు పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు తరగతులు ప్రారంభించగా.. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు అధికారికంగా ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల పని వేళలు ఉండనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.