Bank Loan: మీరు బ్యాంకులో రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ పెట్టుబడులను హామీగా చూపించవచ్చు
Bank Loan: ఆర్థిక ప్రణాళికలో పెట్టుబడులనేవి కేవలం రాబడికే కాకుండా అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కూడా అందుకుంటాయి..
Bank Loan: ఆర్థిక ప్రణాళికలో పెట్టుబడులనేవి కేవలం రాబడికే కాకుండా అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కూడా అందుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనం ఆ పెట్టుబడులను నిలిపివేయడమో లేదా వెనక్కి తీసుకోవడమో జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనకు చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు అవసరమైనా, అంతకంటే ఎక్కువ విలువ గల పెట్టుబడులను నిలిపివేయడం మంచిదేనా.? ఇలాంటి సందర్భాలలో ఈ పెట్టుబడులను పూచీకత్తుగా చూపించి రుణాలను తీసుకుని తర్వాత చెల్లించవచ్చు. అన్ని పెట్టుబడులనూ హామీగా చూపెట్టి రుణాలను పొందలేకపోయినా.. కొన్ని రకాల పెట్టుబడులను పూచీకత్తుగా చూపించి రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
ఆస్తులపై రుణాలు తీసుకోవడం:
పూచీకత్తు రుణాల్లో ముఖ్యమైనది ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం. నివాస, వాణిజ్య ఆస్తులపై చట్టబద్ధంగా హక్కు గల వ్యక్తులకే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆస్తులకు సంబంధించిన పత్రాలను పూచీకత్తుగా చూపించి విద్య, గృహాల కొనుగోలు, బిజినెస్ అవసరాలకు రుణాలు పొందవచ్చు. ఈ తరహా రుణాలలో వడ్డీరెట్లు తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఒక వేళ రుణం తీసుకుని సకాలంలో చెల్లించని పక్షంలో రుణం ఇచ్చిన బ్యాంకు తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే చెల్లించాల్సిన రుణం కంటే ఆస్తి విలువ ఎక్కువున్న సందర్భాల్లో రుణగ్రహీతకు చట్ట పరంగా రక్షణ లభిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో మీ ఆర్థిక సలహాదారును లేదా లాయర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.
నాన్-టర్మ్ జీవిత బీమా పాలసీలు:
రుణాలపై హామీగా చూపించే అన్ని రకాల జీవిత బీమా పాలసీలు పనికి రావు. ఉదాహరణకు చెప్పాలంటే.. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు, టర్మ్ పాలసీలు ఈ రుణాలకు పనికికావు. ఎండోమెంట్, మనీబ్యాక్ లాంటి సంప్రదాయ బీమా పథకాల ద్వారా రుణాలు పొందవచ్చు. రుణం తీసుకునేముందు ఏ తరహా జీవిత బీమా పాలసీలకు అర్హత ఉందో చూసుకోవడం మంచిది. అందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
అలాగే మీ పాలసీపై ఉన్న హామీ మొత్తం రూ.10 లక్షలు అయినంత మాత్రాన మీకు రూ.10 లక్షల రుణం లభించదు. పాలసీ సరెండర్ విలువ ఆధారంగా రుణ మొత్తం మంజూరు చేస్తారు. మీరు స్వచ్ఛందంగా పాలసీని సరెండర్ చేసినప్పుడు ఆ పాలసీకి ఉన్న విలువను సరెండర్ విలువ అంటారు. చాలా సందర్భాల్లో సరెండర్ విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణాన్ని ఇస్తారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు:
బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను పూచీకత్తుగా చూపించి రుణాలు పొందవచ్చు. సంప్రదాయ రుణాలతో పోలిస్తే ఈ తరహా రుణాలలో వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లను తనఖా పెట్టి తీసుకునే వ్యక్తిగత రుణాలు ఒక్క రోజులోనే మంజూరయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ బాండ్లు:
పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో బాండ్లు, డిపాజిట్లు, ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్ల వంటివి ఉంటే అత్యవసర సమయాల్లో రుణం తీసుకునేందుకు వీటిని హామీగా పెట్టవచ్చు. ప్రభుత్వ బాండ్లలో నాబార్డ్, సార్వభౌమ పసిడి పథకాలు వంటి వాటిని రుణం తీసుకునేందుకు పూచీకత్తుగా చూపించవచ్చు. అయితే ఈ తరహా పెట్టుబడుల్లో ప్రభుత్వ విశ్వాసం, భద్రత ఉన్నప్పటికీ, ఇతర పథకాలతో పోలిస్తే వీటికి నగదు లభ్యత తక్కువ.
జాతీయ పొదుపు పత్రాలు:
జాతీయ పొదుపు పత్రాల ద్వారా వ్యక్తులు రుణాలు పొందవచ్చు. మిగిలిన సంప్రదాయ వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటి పూచీకత్తుగా ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. ఈ నిబంధనలు ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. మొత్తం సర్టిఫికెట్ విలువలో 85 నుంచి 90 శాతం వరకు రుణం లభిస్తుంది. మూడేళ్ల కాలవధి గల సర్టిఫికెట్లపై ఎక్కువ మొత్తంలో రుణం పొందవచ్చు.