Credit Card: క్రెడిట్ కార్డు నుంచి ఈ చెల్లింపులు చేస్తున్నారా..? మీరు అప్పులపాలవ్వడం ఖాయం..
క్రెడిట్ కార్డును సరిగ్గా వాడితే లాభాలుంటాయి. అదే విచ్చలవిడిగా వాడితే అప్పలపాలవ్వడం ఖాయం. కార్డును ఎలా వాడాలో తెలియక చాలమంది అప్పులపాలవుతున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్లు చేయకపోవడమే మంచిదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అవేంటి అనేది ఇందులో చూద్దాం.

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ చిన్న లావాదేవీకి దీనిని వాడుతున్నారు. రూపే కార్డును యూపీఐకు లింక్ చేసుకునే అవకాశం ఉండటంతో చిన్న చిన్న మొత్తాలకు కూడా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో అనేక చెల్లింపులు సులువుగా పూర్తవుతున్నాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డును వాడకపోవడం వల్లనే మంచి జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కార్డును వాడకపోవడం మంచిదనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..?
క్రెడిట్ కార్డు ఉపయోగించి చాలామంది ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తుంటారు. కార్డు పరిమితిలో 20 శాతం నగదును విత్ డ్రా చేసుకునే అవకాశముంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఏటీఎం ద్వారా చేసే విత్ డ్రాలకు అధిక వడ్డీ, ఛార్జీలు పడతాయి. విత్ డ్రా చేసిన రోజు నుంచే వడ్డీ లెక్కిస్తారు. నెలకు ఈ వడ్డీ సుమారు 2.85 శాతంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు 2.50 శాతం నుంచి 3 శాతం వరకు ఫ్లాట్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు విధిస్తారు. దీంతో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోకపోవడమే మంచిది.
బిల్లు కట్టలేకపోతున్నారా..?
ఇక కిరాణా, ఆహారం, గృహ అవసరాల కోసం చిన్న మొత్తంలో చెల్లింపులు చేసేటప్పుడు క్రెడిట్ కార్డును వాడకపోవడమే మంచిది. దీని వల్ల మీ బడ్జెట్ పెరుగుతుంది. బిల్లు కట్టలేక ఇబ్బందులు ఎదురుకావొచ్చు. దీనికి బదులు నగదును చెల్లించండి. లేక మీ డెబిట్ కార్డును ఉపయోగించండి. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డును ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే విదేశాల్లో చేసే ట్రాన్సాక్షన్లకు ప్రత్యేక ఛార్జీలు విధిస్తారు. విదేశీ కరెన్సీ మార్పిడి, నగదు అడ్వాన్స్, విదేశీ లావాదేవీ ఛార్జీలు వంటివి విధిస్తారు. దీని వల్ల మీపై అదనపు భారం పడుతుంది. 3 శాతం వరకు ఈ ఛార్జీలు ఉంటాయి. దీనికి బదులు ప్రీపెయిడ్ కరెన్సీ కార్డును ఉపయోగించుకోండి. ఇక గడువులోగా బిల్లులు కట్టలేని పరిస్థిత ఉన్నప్పుడు క్రెడిట్ కార్డులు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఆలస్య చెల్లింపులకు రూ.250 నుంచి రూ.600 వరకు జరిమానా విధిస్తారు. అలాగే బకాయిపై 2.5 శాతం నుంచి 3 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తారు. లావాదేవీ జరిగిన తేదీ నుంచి వీటిని లెక్కిస్తారు. ఇక మినిమం బ్యాలెన్స్ చెల్లిస్తే మిగిలిన బ్యాలెన్స్‌పై 5 శాతం వడ్డీని లెక్కిస్తారు. దీంతో మీపై అదనంగా భారం పడి అప్పులపాలవుతారు. దీంతో బిల్లులు చెల్లించలేని పక్షంలో క్రెడిట్ కార్డును వాడకండి.
