75 శాతం సంపద సమాజానికే..! కొడుకు మరణంతో వేదాంత గ్రూప్ అధినేత సంచలన నిర్ణయం!
వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ 49 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. స్కీయింగ్ ప్రమాదం తర్వాత కోలుకుంటుండగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. అనిల్ అగర్వాల్ ఈ విషాద వార్తను పంచుకుంటూ, తన 75 శాతం సంపదను సమాజ సేవకు అంకితం చేస్తానని ప్రకటించారు.

వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనిల్ అగర్వాల్ స్వయంగా తన కొడుకు మరణ వార్తను పంచుకున్నారు. ఒక పోస్ట్‌లో నా ప్రియమైన కుమారుడు అగ్నివేష్ చాలా త్వరగా మమ్మల్ని విడిచిపెట్టాడు. అతనికి కేవలం 49 సంవత్సరాలే, ఆరోగ్యంగా, జీవితం, కలలతో నిండి ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో స్కీయింగ్ ప్రమాదం తర్వాత న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో కోలుకుంటూ ఉండగా గుండెపోటు రావడంతో అగ్నివేష్ మరణించినట్లు ఆయన తెలిపారు.
75 శాతం సంపాదన సమాజానికి..
ఏ బిడ్డ ఆకలితో నిద్రపోకూడదని, ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని, ప్రతి స్త్రీ తన కాళ్లపై నిలబడాలని, దేశంలోని ప్రతి యువతకు అర్థవంతమైన పని ఉండాలని మేం కలలు కన్నాం. మనం సంపాదించే ప్రతిదానిలో 75 శాతం కంటే ఎక్కువ సమాజానికి ఇస్తామని నేను హామీ ఇచ్చాను. ఈ రోజు నేను ఆ వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాను అని అనిల్ అగర్వాల్ అన్నారు.
అనిల్ అగర్వాల్‌కు అగ్నివేశ్‌తో పాటు కుమార్తె ప్రియ ఉన్నారు. ఆమె వేదాంతా లిమిటెడ్ బోర్డు మెంబర్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వేదాంతా అనుబంధ సంస్థ తల్వండి సోబో పవర్ లిమిటెడ్‌కు అగ్నివేశ్ ఛైర్మన్. అనిల్ అగర్వాల్ నికర సంపద 330 కోట్ల డాలర్లు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
