ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. పెరిగిన పైసలు, పనిదినాలు.. ఎంతంటే..?
MNREGA: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మారింది. పని దినాలతో పాటు రోజువారీ వేతనాన్ని సైతం కేంద్రం పెంచింది. ఈ పథకం కోసం కేంద్రం రూ.1.51 లక్షల కోట్లు కేటాయించింది. ఇది గ్రామీణ కార్మికులకు ఆర్థిక భద్రతను, జీవనోపాధిని పెంచుతుంది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పథకం పేరును మార్చడంతో పాటు పని దినాల సంఖ్యను, కనీస వేతనాన్ని పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఈ బిల్లు ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో మూడు ప్రధాన మార్పులు జరిగాయి. ఉపాధి హామీ పథకం పేరును అధికారికంగా పూజ్య బాపు గ్రామీణ రోజుగార్ యోజనగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంచేందుకు, ఈ పథకం కింద హామీ ఇచ్చే పని దినాల సంఖ్యను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు. గ్రామీణ కార్మికులకు మరింత ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రోజువారీ కనీస వేతనాన్ని రూ. 240కి సవరించారు. ఇక ఈ పూజ్య గ్రామీణ రోజ్‌గార్ యోజన కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.51 లక్షల కోట్లు కేటాయించింది.
పథకం నేపథ్యం – ప్రయోజనాలు
ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంచడం. ముఖ్యంగా వ్యవసాయం తక్కువగా ఉండే సమయంలో ఈ పథకం కోట్లాది మంది గ్రామీణ కార్మికులకు ఆర్థికంగా మద్దతు ఇస్తుంది. ఈ పథకం 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ద్వారా NREGA పేరుతో ప్రారంభించారు. గ్రామీణ రోడ్లు, చెరువులు తవ్వకం, నీటి సంరక్షణ, కాలువలు సృష్టించడం వంటి మౌలిక సదుపాయాల పనులను ఈ పథకం కింద చేపడతారు. గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, నగరాలకు వలసలను తగ్గించడం, గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








