- Telugu News Photo Gallery Chanakya Niti: 5 Types of People You Must Avoid for Success and Peace of Mind
Chanakya Niti: ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్ ఉండదు..
గొప్ప తత్వవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన ప్రసిద్ధ గ్రంథం చాణక్య నీతిలో జీవితాన్ని విజయవంతంగా, సురక్షితంగా మార్చుకోవడానికి ఎన్నో విలువైన చిట్కాలను అందించారు. ముఖ్యంగా జీవితంలో మన సంబంధాలు దెబ్బతినేందుకు కారణమయ్యే, మన పురోగతికి ఆటంకం కలిగించే వ్యక్తుల గురించి ఆయన హెచ్చరించారు. చాణక్యుడి ప్రకారం.. మీ మనశ్శాంతిని, సామాజిక గౌరవాన్ని, విజయ మార్గాన్ని అడ్డుకునే ఆ ఐదు రకాల వ్యక్తులు ఎవరో చూద్దాం.
Updated on: Dec 13, 2025 | 9:44 AM

ఎప్పటికీ సంతృప్తి చెందని వ్యక్తి: చాణక్య నీతి ప్రకారం.. ఎప్పుడూ సంతృప్తి చెందని వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరుల పురోగతి పట్ల అసూయతో ఉంటారు. అలాంటి వ్యక్తులు మీ మంచి పనులలో కూడా తప్పులు వెతుకుతారు. ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదు చేస్తారు. వారి సహవాసం మీ శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి, నిరాశ, ప్రతికూల భావాలకు దారితీస్తుంది. వీరితో ఎక్కువగా దగ్గరగా ఉండకపోవడమే మంచిది.

తప్పుడు స్నేహితులు: ముఖం ముందు మిమ్మల్ని బాగా పొగుడుతూ వెనుక మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడేవారు మీకు అతిపెద్ద శత్రువులు అని చాణక్యుడు చెప్పాడు. వీరిని పాల అంచు వరకు నిండిన విషపు కుండతో పోల్చారు. కష్ట సమయంలో వీరే ముందుగా మీకు ద్రోహం చేస్తారు.

దురాశ గల వ్యక్తులు: డబ్బు లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు. వీరు తమ స్వార్థం కోసం మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. ఒకవేళ వీరు దొరికిపోతే మీ గౌరవం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

మూర్ఖులు - అజ్ఞానులు: మంచి సలహాను కూడా అర్థం చేసుకోలేని, సమయం వృధా చేసే వ్యక్తుల దగ్గర ఉండకపోవడం చాలా మంచిది. మూర్ఖుడికి ఏదైనా చెప్పడానికి ప్రయత్నించడం లేదా వారితో వాదించడం వల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది. మీ మనశ్శాంతి దెబ్బతింటుంది. వీరి వల్ల మీ జీవితానికి ఎటువంటి ఉపయోగం ఉండదు.

కష్టంలో వదిలేసేవారు: మీరు సంతోషంగా, సంపదలో ఉన్నప్పుడు మాత్రమే మీతో ఉండి మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసేవారిని అస్సలు నమ్మొద్దు. నిజమైన సంబంధం కష్టకాలంలోనే నిలబడుతుంది. అలాంటి స్వార్థపరులు మీకు అత్యవసరమైన సమయంలో ద్రోహం చేసి, మానసిక, ఆర్థిక నష్టాలను కలిగిస్తారు.

చాణక్యుడి సలహా: చెడు సహవాసం బొగ్గు లాంటిది. అది వేడిగా ఉన్నప్పుడు మీ చేయి కాలుస్తుంది. చల్లగా ఉన్నప్పుడు మీ చేతిని నల్లగా మారుస్తుంది. అందుకే జీవితంలో శాంతి, పురోగతి, విజయం కావాలంటే, ఎల్లప్పుడూ మంచి వ్యక్తులతో మాత్రమే స్నేహం చేయాలని చాణక్యుడు నొక్కి చెప్పారు.




