Andhra Pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.830 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్..
ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేయనుంది. రూ.830.04 కోట్లతో విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, షూలు వంటి అవసరమైన వస్తువులు అందిస్తారు. ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, విద్యార్థుల విద్యను ప్రోత్సహిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం కోసం సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దీనికి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులను ఒకేసారి అందించనుంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించి, విద్యార్థులను చదువుపై మరింత దృష్టి సారించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కిట్ల పంపిణీ కోసం మొత్తం రూ. 830.04 కోట్లు నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ నిధుల కేటాయింపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నాణ్యమైన కిట్లను అందించడానికి మార్గం సుగమమైంది. సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లో విద్యార్థులకు అవసరమైన అనేక వస్తువులు ఉంటాయి. ఇందులో 3 జతల యూనిఫాం క్లాత్‌లు, నోట్ బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, బెల్ట్, షూలు, స్కూల్ బ్యాగ్, డిక్షనరీ వంటివి ఉన్నాయి. విద్యార్థులకు ఒకే చోట అన్ని అవసరాలు తీర్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర నిధులతో పాటు కిట్ల సేకరణ, పంపిణీకి అవసరమయ్యే నిధులలో రూ. 157.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం కూడా సమకూర్చనుంది. కిట్ల సరఫరాలో నాణ్యత, పారదర్శకతను పాటించేందుకు గాను టెండర్ల ప్రక్రియ ద్వారా సరఫరాదారులు, పంపిణీ దారులను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




