Wealth Strategy: ధనవంతుడిగా నటించొద్దు, నిజంగా అవ్వండి! రూ. 25 కోట్లు తెచ్చిపెట్టిన స్ట్రాటజీ ఇదే
ఈ రోజుల్లో చాలా మంది ధనవంతులుగా కనిపించడానికి ఆరాటపడుతున్నారు. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ వస్తువులు, పెద్ద ఇళ్లు... ఇవన్నీ ఉంటేనే ధనవంతులు అనుకుంటారు. కానీ, నిజమైన సంపద అంటే అది కాదని ఒక చార్టెడ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి! మరి అసలైన డబ్బు సంపదకు అతడు అందిస్తున్న టిప్స్ ఏంటో మీరూ తెలుసుకోండి.

సీఏ కౌశిక్ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ఒక కీలకమైన ప్రశ్న వేశారు: “ధనవంతుడిగా కనిపించాలనుకుంటున్నారా? లేక నిజంగా ధనవంతులు కావాలనుకుంటున్నారా?” అంతేకాదు, ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఎలా రూ. 25 కోట్ల సంపదను నిశ్శబ్దంగా నిర్మించుకున్నాడో వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నిజమైన సంపద అంటే ఏంటి?
కౌశిక్ ప్రకారం, నిజమైన సంపద అంటే పైపై ఆడంబరాలు కాదు. విలువ పెరిగే ఆస్తులను సమకూర్చుకోవడం ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ మరియు మనశ్శాంతి అని ఆయన స్పష్టం చేశారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే: ఒక వ్యక్తికి రూ. 25 కోట్ల సంపద ఉంది. కానీ అతను మామూలు, సాధారణ కారులో తిరుగుతాడు. మరొక వ్యక్తికి కేవలం రూ. 1.7 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. కానీ అతను ఖరీదైన, విలాసవంతమైన కారును ప్రదర్శిస్తాడు. ఇక్కడ గమనిస్తే, మొదటి వ్యక్తి తెలివిగా పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటే, రెండో వ్యక్తి కేవలం తన హోదాను చూపించుకోవడానికి ఖర్చు చేస్తున్నాడు.
రెండు రకాల జీవితాలు, రెండు రకాల ఆర్థిక నమూనాలు:
కౌశిక్ రెండు ఆర్థిక నమూనాలను వివరించారు: మొదటి వ్యక్తి (నిజమైన సంపన్నుడు) చాలా తక్కువ ఖర్చులు పెడతాడు. ఈక్విటీ, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడతాడు. కాలక్రమేణా అతని సంపద పెరుగుతూ, అతనికి ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. రెండో వ్యక్తి (ధనవంతుడిగా కనిపించేవాడు) ఎక్కువ EMIలు కడుతుంటాడు. పొదుపు చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడూ తన హోదాను కాపాడుకోవడం కోసం ఖర్చు చేస్తుంటాడు. చివరికి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాడు.
కార్లు వంటి వస్తువులు కేవలం తరుగుదలకే తప్ప, అవి నిజమైన సంపదకు సూచికలు కావని కౌశిక్ బల్లగుద్ది చెప్పారు. నిజమైన సంపన్నులు తమ ధనాన్ని చూపించుకోవడానికి ఆరాటపడరు. బదులుగా, క్రమశిక్షణ, సహనం, తెలివైన పెట్టుబడుల ద్వారా ఆర్థిక స్వేచ్ఛ, సమయం, మనశ్శాంతిని సాధిస్తారు.




