Gold Reserves: బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
బంగారం కేవలం ఆభరణాలకు మాత్రమే పరిమితం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బంగారం చాలా కీలకం. ఏ దేశంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉన్నట్టు. మరి ప్రపంచంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవో తెలుసా?

బంగారం ఈ భూమి మీద దొరికే విలువైన లోహాల్లో ఒకటి కాబట్టి. దాన్ని దేశాలు ఎకనమిక్ స్టెబిలిటీ కోసం దాచుకుంటాయి. ఒక దేశం యొక్క ఆర్థిక భద్రత, స్టెబిలిటీ అనేవి ఆ దేశంలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ను బట్టి మారుతుంటాయి. దేశం ఆర్థికంగా బలహీన పడుతుంటే ఆ గోల్డ్ రిజర్వ్స్ ను అమ్ముకోవాల్సి వస్తుంది. ఒకవేళ బలపడుతుంటే అదనంగా బంగారం కొంటూ ఉంటారు. తాజా డేటా ప్రకారం ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాలు ఎవో ఇప్పుడు చూద్దాం.
అమెరికా
ఈ ఏడాది నాటికి అమెరికా దేశపు బంగారు నిల్వలు 8,133.46 టన్నులు. 2000 నుంచి 2025 వరకు అమెరికా బంగారు నిల్వలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. 2001లో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ రిజర్వ్స్ 8,149.05 టన్నులకు చేరుకున్నాయి. ప్రస్తుతం కొద్దిగా తగ్గాయి.
జర్మనీ
ఈ ఎడాది నాటికి జర్మనీ బంగారు నిల్వలు 3,350.25 టన్నులు ఉన్నాయి. 2000 నుంచి 2025 మధ్య సగటున 3,398.28 టన్నులుగా ఉన్న ఈ నిల్వలు.. క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2000లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ 3,468.60 టన్నులు ఉన్నాయి.
ఇటలీ
బంగారం నిల్వల విషయంలో ఇటలీ చాలా స్థిరంగా ఉంటూ వస్తోంది. 2000 నుంచి 2025 వరకు ఇటలీ నిల్వలు సగటున 2,451.84 టన్నులు ఉంటూ వచ్చాయి. ప్రస్తుతం కూడా అదే నెంబర్ ను మెయింటెయిన్ చేస్తుంది ఇటలీ.
ఫ్రాన్స్
బంగారు నిల్వల విషయంలో ఫ్రాన్స్ తడబడుతూ వస్తోంది. 2002లో 3,000 టన్నులు ఉన్న నిల్వలు 2012లో 2,435.38 టన్నులకు పడిపోయాయి. ప్రస్తుతం 2025లో 2,437 టన్నుల వద్ద స్థిరంగా ఉన్నాయి.
రష్యా
రష్యా బంగారు నిల్వలు ర్యాపిడ్ గా మారుతూ వస్తున్నాయి. 2000 సంవత్సరంలో అత్యంత భారీగా తగ్గిపోయాయి. అప్పుడు కేవలం 343.41 టన్నులతో లీస్ట్ రిజర్వ్స్ ను నమోదు చేసింది. ఆ తర్వాత 2000 నుంచి 2025 వరకూ మెల్లగా రిజర్వ్స్ పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతానికి రష్యా దగ్గర 2,329.63 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి.
చైనా
చైనా గత ఎన్నో ఏళ్లుగా బంగారు నిల్వలను అలాగే మెయింటెయిన్ చేస్తోంది. సగటున 2,279.6 టన్నుల బంగారంతో చాలా ఏళ్ల నుంచి స్థిరంగా ఉంది.
స్విట్జర్లాండ్
చిన్నదేశమైన స్విట్జర్లాండ్ దగ్గర దాదాపు 1,040 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇవి కూడా చాలా స్థిరంగా మెయింటెయిన్ అవుతూ వస్తున్నాయి.
భారతదేశం
ఇక భారతదేశం విషయానికొస్తే.. బంగారు నిల్వలు విషయంలో మనదేశం 8వ స్థానంలో ఉంది. 2025నాటికి మన దగ్గర 880 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి . 2001 లో అత్యల్పంగా 357.75 టన్నుల నుంచి మెల్లగా నిల్వలు పెంచుకుంటూ వస్తోంది ఇండియా. అయితే మిగతా దేశాలతో పోలిస్తే.. బంగారు ఆభరణాలు ఎక్కువగా వాడేది మనదేశంలోనే. మరో మాటలో చెప్పాలంటే.. భారతీయుల ఇంట్లో ఉండే బంగారాన్ని కూడా కలుపుకుంటే మన దగ్గర ఉన్నబంగారం పైన చెప్పుకున్న దేశాల కంటే చాలా ఎక్కువ ఉండొచ్చు. కేవలం భారతీయ మహిళల దగ్గరే సుమారు 24,000 టన్నుల బంగారం ఉందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అంటే అమెరికా బంగారు నిల్వల కంటే మూడు రెట్లు ఎక్కువ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




