Bank locker charges: బ్యాంకు లాకర్లకు ఎంత చార్జీ కట్టాలో తెలుసా.. ఆ బ్యాంకులో తక్కువ అద్దె
మానవులకు, బ్యాంకులకు విడదీయలేని సంబంధం ఉంది. మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ వీటితో అవసరం ఏర్పడుతుంది. మనిషి అత్యంత భద్రమైన ప్రదేశాలుగా భావించే వాటిలో బ్యాంకులు ముందు వరసలో ఉంటాయి. అందుకనే బ్యాంకులు అందించే వివిధ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలకు పూర్వకాలం నుంచి ఇప్పటికీ ప్రజల ఆదరణ కొనసాగుతోంది. వాటిలోనే డబ్బులను పెట్టడానికి ప్రజలు ఇష్టపడతారు. అలాగే బ్యాంకు లాకర్లు లేదా సేఫ్ డిపాజిట్ లాకర్లలో మనం అనేక ముఖ్యమైన, విలువైన వస్తువులు, పత్రాలు దాచుకుంటూ ఉంటాం. ఒకరకంగా చెప్పాలంటే ఇంటి కన్నా బ్యాంకులే సురక్షితమని నమ్ముతాం. ఈ నేపథ్యంలో బ్యాంకు లాకర్లు అంటే ఏమిటి, వాటి వినియోగించుకుంటే చార్జీలు ఉంటాయా, అతి తక్కువ చార్జీ వసూలు చేసే బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే, కొన్ని వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచడానికి ఇష్టపడతాం. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, విలువైన పత్రాలు, పిల్లల వీలునామాలు తదితర వాటిని బ్యాంకు లాకర్లలో దాచుకుంటాం. అవి ఇంటిలో ఉంటే దొంగలు పడి దోచుకుంటారనే భయం ఉంటుంది. దీంతో బ్యాంకు లాకర్లు సురక్షితమైన ప్రదేశం అని చెప్పవచ్చు. లాకర్లను వివిధ బ్యాంకులు అద్దెకు ఇస్తాయి. వీటిలో మనం విలువైన వస్తువులు దాచుకోవచ్చు. వీటి తాళాలను బ్యాంకు, మనమే తీయగలం. మన దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకుల్లోనూ లాకర్ల సదుపాయం ఉంది. లాకర్ పరిమాణంతో పాటు బ్యాంకు ఉన్నప్రదేశం బట్టి వాటి అద్దె ఆధారపడి ఉంటుంది. గ్రామం, నగరం, మెట్రో సిటీ తదితర వాటి ఆధారంగా చార్జీలు వసూలు చేస్తారు. పట్టణాలతో పోల్చితే గ్రామీణ బ్యాంకు శాఖల్లో తక్కువ అద్దె ఉంటుంది. లాకర్లపై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వార్షిక అద్దె వివరాలు ఇలా ఉన్నాయి. వీటికి జీఎస్ టీ అదనంగా చెల్లించాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)
ఎస్బీఐలో చిన్న లాకర్ కు అర్బన్ ఏరియాలో రూ.1500, గ్రామీణ ప్రాంతంలో రూ.వెయ్యి, మీడియం లాకర్ కు అర్బన్ ఏరియాలో రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.2 వేలు, పెద్ద లాకర్ కు అర్బన్ లో రూ.6 వేలు, గ్రామాల్లో రూ.5 వేలు, అతి పెద్ద లాకర్ కు అర్బన్ లో రూ.9 వేలు, గ్రామాల్లో రూ. 7 వేలు చెల్లించాలి.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఆరు రకాల సైజుల్లో లాకర్లు అందుబాటులో ఉన్నాయి. అతి చిన్న లాకర్ కు రూ.1100 (అర్బన్), రూ.550 (గ్రామం), చిన్న లాకర్ కు రూ.1650 (అర్బన్), రూ.850 (గ్రామం), మీడియం లాకర్ కు రూ.3 వేలు (అర్బన్), రూ.1250 (గ్రామం), ఎక్స్ ట్రా మీడియం లాకర్ కు రూ.3300 (అర్బన్), రూ.1500 (గ్రామం), పెద్ద లాకర్ కు రూ.7 వేలు (అర్బన్), రూ.3300 (గ్రామం), అతి పెద్ద లాకర్ కు రూ.15 వేలు (అర్బన్), రూ.9 వేలు(గ్రామం) చొప్పున చార్జీలు వసూలు చేస్తారు.
ఐసీఐసీఐ బ్యాంకు
నాలుగు రకాల సైజుల్లో ఈ బ్యాంకు లాకర్లు అందుబాటులో ఉన్నాయి. అర్బన్, గ్రామాల వారీగా వాటి చార్జీలు వసూలు చేస్తారు. చిన్నలాకర్ కు రూ.3 వేలు, రూ.1200, మీడియం లాకర్ కు రూ.6 వేలు, రూ.2500, పెద్ద లాకర్ కు రూ.పదివేలు, రూ.4 వేలు, అతిపెద్ద లాకర్ కు రూ.16 వేలు, రూ.10 వేలు చొప్పున ఏడాదికి వసూలు చేస్తారు.
యాక్సిస్ బ్యాంకు
యాక్సిస్ బ్యాంకులో చిన్న లాకర్ రూ.3105, రూ.1500, మీడియం లాకర్ రూ.6900, రూ.2200, పెద్ద లాకర్ రూ.11,800, రూ.5 వేలు, అతి పెద్ద లాకర్ రూ.14,256, రూ.10 వేల అద్దె ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ)లో చిన్న లాకర్ కు రూ.1250 (సెమీ, అర్బన్), రూ.2 వేలు (అర్బన్, మెట్రో), మీడియం లాకర్లకు రూ.2500, రూ.3500, పెద్ద లాకర్ కు రూ.3 వేలు, రూ.5500, చాలా పెద్ద లాకర్ కు రూ.6 వేలు, రూ.8 వేలు, అతి పెద్ద లాకర్ కు రూ. పదివేలు చొప్పులు చార్జీలు వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







