Best scooters: స్కూటర్ల విభాగంలో వీటికివే సాటి.. హీరో జూమ్ 160, యమహా ఏరోక్స్ 155 మధ్య తేడాలివే..!
మన దేశంలో స్కూటర్ల అమ్మకాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లోనూ వీటిదే అగ్రస్థానం. ఆధునిక జీవన శైలికి అనుగుణంగా పురుషులు, మహిళలు వినియోగించుకునేలా వీటిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మహిళలు కూడా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో దూసుకువెళుతున్నారు. పురుషులతో సమానంగా అన్నింటిలోనూ రాణిస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది.

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో నుంచి జూమ్ 160 పేరుతో కొత్త స్కూటర్ విడుదలైంది. ఇదే విభాగంలో యమహా ఏరోక్స్ 155 స్కూటర్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ రెండు స్కూటర్ల మధ్య తేడాలు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం. సాధారంగా దేశంలో విక్రయిస్తున్న స్కూటర్ల ఇంజిన్ సామర్థ్యం 125 సీసీకి మించి ఉండదు. విదేశీ ఓఈఎంల నుంచి మాత్రమే ఖరీదైన మ్యాక్సీ స్కూటర్లు విడుదలయ్యాయి. 2021లో యమహా ఏరోక్స్ ను 155 సీసీతో మార్కెట్ లోకి తీసుకువచ్చారు. ఇది మినహా ఇప్పటి వరకూ అంత ఇంజిన్ సామర్థ్యంతో ఏ స్కూటర్ విడుదల కాలేదు. తాజాగా హీరో జూమ్ 160 సీసీ ఇంజిన్ తో కస్టమర్ల ముందుకు వచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో దీన్ని ప్రదర్శించారు. ఈ స్కూటర్ 110, 125 మోడళ్లలోనూ అందుబాటులో ఉంది.
ధర వివరాలు
- హీరో జూమ్ 160 స్కూటర్ ధర రూ.1.48 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
- యమహా ఏరోక్స్ ధర రూ.1.49 లక్షల నుంచి రూ.1.53 లక్షల మధ్య ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.
ఇంజిన్ సామర్థ్యం
- హీరో జూమ్ 160 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తోంది. దీని నుంచి 8000 ఆర్పీఎం వద్ద 14.20 బీహెచ్పీ గరిష్ట శక్తి, 6500 ఆర్పీఎం వద్ద 14 ఎన్ ఎం టార్కును విడుదల అవుతుంది.
- యమహా ఏరోక్స్ లో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ , సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్ నుంచి 8000 ఆర్పీఎం వద్ద 14.49 బీహెచ్పీ గరిష్ట శక్తి, 6500 ఆర్పీఎం వద్ద 13.9 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది.
ఇతర ప్రత్యేకతలు
- హీరో జూమ్ స్కూటర్ సీటు ఎత్తు 787 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 155 ఎంఎం, వీల్ బేస్ 1,348 ఎంఎంగా ఉన్నాయి. ఫ్యూయల్ కెపాసిటీ 7 లీటర్లు, స్కూటర్ బరువు 142 కేజీలు.
- యమమా ఏరోక్స్ స్కూటర్ సీటు ఎత్తు 790 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 145 ఎంఎం, వీల్ బేస్ 1,350 ఎంఎంగా ఉన్నాయి. దీని ఫ్యూయల్ కెపాసిటీ 5.5 లీటర్లు. ఈ స్కూటర్ బరువు 126 కేజీలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
