Indian Railway: దేశంలో 16 స్టేషన్లు విమానాశ్రయం మాదిరిగా నిర్మాణం.. అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులో..
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌తో సహా మొత్తం 16 రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి కోసం భారతీయ రైల్వే రాబోయే రెండు నెలల్లో బిడ్‌లను ఆహ్వానిస్తుంది..

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌తో సహా మొత్తం 16 రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి కోసం భారతీయ రైల్వే రాబోయే రెండు నెలల్లో బిడ్‌లను ఆహ్వానిస్తుంది. నివేదికల ప్రకారం.. తాంబరం, విజయవాడ, దాదర్, కళ్యాణ్, థానే, అంధేరి, కోయంబత్తూర్ జంక్షన్, పూణె, బెంగళూరు సిటీ, వడోదర, భోపాల్, చెన్నై సెంట్రల్, హజ్రత్ నిజాముద్దీన్, అవడి రైల్వే స్టేషన్‌లు పునరాభివృద్ధి చేయనున్నారు. ఈ రైల్వే స్టేషలన్నీ విమానాశ్రయాల మాదిరిగా నిర్మించనున్నారు. భారతీయ రైల్వే ప్రణాళిక ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ అన్ని రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి బిడ్డింగ్ చేయవచ్చు. మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ రైల్వే స్టేషన్లు అప్‌గ్రేడ్ చేయబడతాయి. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ మానిటైజేషన్ నమూనాలను పరిశీలిస్తున్నారు.
మొదటి దశలో రోజుకు 50 లక్షల మందితో 199 స్టేషన్లను పునరాభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేయబడింది. రీడెవలప్ చేసిన స్టేషన్ల రూపకల్పనలో రిటైల్ సేల్స్, కెఫెటేరియా, వినోద సౌకర్యాల కోసం స్థలం కూడా ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు. 47 స్టేషన్లకు టెండర్లు వేశామని, 32 స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయని వైష్ణవ్ తెలిపారు. తద్వారా సౌకర్యాల ప్రయోజనాలను వీలైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ 3 స్టేషన్లు పునరుద్ధరణ:




న్యూఢిల్లీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి కోసం భారతీయ రైల్వే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దాదాపు రూ. 10,000 కోట్ల పెట్టుబడితో రైల్వేల ఈ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇటీవల ఆమోదించింది. న్యూఢిల్లీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత, దేశంలోని ఈ మూడు రైల్వే స్టేషన్‌లను విమానాశ్రయం కంటే అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. మూడున్నరేళ్లలో న్యూఢిల్లీ స్టేషన్ పునర్ అభివృద్ధిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




