IT Returns: అలా అయితే తప్ప.. సీనియర్ సిటిజన్స్ ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయనవసరం లేదు.. 60 ఏళ్లు పైబడిన వారికి టాక్స్ రాయితీలు ఇవే..
సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడమే కాకుండా పెట్టుబడులు, రాబడులపై ఆదాయపు పన్ను నుండి ప్రత్యేక ఉపశమనం పొందుతారు.
IT Returns: సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడమే కాకుండా పెట్టుబడులు, రాబడులపై ఆదాయపు పన్ను నుండి ప్రత్యేక రాయితీలు పొందుతారు. సీనియర్ సిటిజన్లు రూ .3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్లకు టాక్స్ మినహాయింపులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
పన్ను పరిమితిలో మినహాయింపు ఆర్థిక సంవత్సరంలో సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితి రూ .3 లక్షలు కాగా, సాధారణ వ్యక్తులకు ఈ పరిమితి రూ .2.5 లక్షల వరకు మాత్రమే. సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే 80 ఏళ్లకు పైబడిన వారికి ఇది రూ.5 లక్షలు. అంటే, ఒక సీనియర్ సిటిజన్ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉండి.. వారికీ ఏవిధమైన టీడీఎస్ (TDS ) లేకపోతే… అతను ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయనవసరం లేదు. అదేవిధంగా, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లకు పైబడిన వారికి) రూ .5 లక్షల వరకు వార్షిక ఆదాయం లేకపోతే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసిన అవసరం లేదు.
వయస్సు 75 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు ఎలాంటి రిటర్న్ అవసరం లేదు.
75 ఏళ్లు పైబడిన వారు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసిన అవసరం లేదు. పెన్షన్ లేదా బ్యాంక్ వడ్డీ ఆదాయంపై మాత్రమే ఆధారపడిన 75 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్ ( ITR) ఫైల్ చేయవలసిన అవసరం లేదు. అయితే, వారు ఇతర మూలాల నుండి అంటే ఇంటి అద్దె లేదా అటువంటి మరేదైనా అయినా కూడా ఆదాయాన్ని పొందుతుంటే కనుక వారు యథావిధిగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
బీమా ప్రీమియంపై ..
సీనియర్ సిటిజన్స్ కోసం వైద్య బీమా ప్రీమియం పై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80D కింద 50 వేల రూపాయల వరకూ మినహాయింపు పొందుతారు. ఇదే సాధారణ పౌరులకు ఈ మొత్తం 25 వేల రూపాయలు.
అలాగే..సెక్షన్ 80 డిడిబి కింద వైద్య చికిత్స ఖర్చులకు మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్ పన్ను చెల్లింపుదారులు కొన్ని నిర్దిష్ట వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులకు రూ.లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు. 60 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి దీనిపై 40 వేల రూపాయల వరకు తగ్గింపు తీసుకోవచ్చు.
వడ్డీ ఆదాయాలపై తగ్గింపు
సీనియర్ సిటిజన్లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల నుండి సంపాదించిన వడ్డీపై రూ .50,000 (వార్షిక) వరకు మినహాయింపు పొందవచ్చు. సాధారణ పౌరుల కోసం, ఈ పరిమితి రూ. 10,000 గా ఉంది.
ఈ-ఫైలింగ్ తప్పనిసరి కాదు..
సూపర్ సీనియర్ సిటిజన్లు తమ రిటర్నులను ITR 1 లేదా ITR 4 లో దాఖలు చేయడం పేపర్ మోడ్‌లో చేయవచ్చు. దీని ఇ-ఫైలింగ్ అవసరం లేదు.
అడ్వాన్స్ టాక్స్ చెల్లింపుపై మినహాయింపు
ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 208 ప్రకారం, ఏడాదికి రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి, అతను ముందుగానే పన్ను(అడ్వాన్స్ టాక్స్) చెల్లించాలి. కానీ, సెక్షన్ 207 ప్రకారం వ్యాపారం లేదా వృత్తి ఆదాయం లేకపోతే సీనియర్ సిటిజన్స్ ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.