4 day week: ఆ దేశంలో వారానికి నాలుగు రోజులే పని.. కార్మికులకు ఇక పండగే..!
మన దేశంలో సాధారణంగా వారానికి ఆరు రోజులు పని, ఒక్కరోజు సెలవు ఉంటుంది. కార్మికులు, ఉద్యోగులు వారంలో ఆరు రోజుల పాటు పనిచేసి, ఆదివారం వచ్చే సెలవు కోసం ఎదురు చూస్తుంటారు. ఇదే సమయంలో ఇటీవల ఓ ప్రముఖుడు వారానికి 90 గంటలు పనిచేస్తే దేశ ప్రగతి బాగుంటుందని వ్యాఖ్యానించడంపై దుమారం రేగింది. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే ఉంటే బ్రిటన్ లో తీరు వేరేలా ఉంది. అక్కడి దాదాపు 200 కంపెనీలు తమ సిబ్బందితో వారానికి నాలుగు రోజులు పనిచేయించుకునేందుకు అంగీకరించాయి.

బ్రిటన్ లోని సుమారు 200 కంపెనీలు వారానికి నాలుగు రోజుల పనిదినాలకు అంగీకారం తెలిపాయి. వాటిలో దాదాపు 5 వేల మంది పనిచేస్తున్నారు. తాజా నిర్ణయంతో వారానికి నాలుగు రోజులు పనిచేసి, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుందని, తగినంత విశ్రాంతి లభించడంతో మరింత బాగా పనిచేస్తారని భావిస్తున్నారు. ఆ కంపెనీలు జీతం కోత లేకుండా వారానికి నాలుగు రోజుల పనిదినాలకు అంగీకరిస్తూ సంతకాలు చేయడం విశేషం. 4 డే వీక్ ఫౌండేషన్ అనే సంస్థ నాలుగు రోజుల పని అనే విధానాన్నిప్రచారం చేసింది. దీనిలో అనేక స్వచ్ఛంద సంస్థలు, మార్కెటింగ్, సాంకేతిక సంస్థలతో పాటు వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీలు పాల్గొన్నాయి. ఫౌండేషన్ ప్రచార డైరెక్టర్ జోరైల్ మాట్లాడుతూ వారానికి ఐదు రోజుల పని విధానం చాలా పాతదన్నారు.
దాదాపు వందేళ్ల క్రితం తీసుకువచ్చిన ఆ పద్ధతి ప్రస్తుత జీవన శైలికి సరిపోదని వ్యాఖ్యానించారు. వారానికి నాలుగు రోజుల పాటు పనిచేస్తే, మిగిలిన సమయంలో ప్రజలు సంతోషంగా గడపడానికి వీలుంటుందన్నారు. ఉద్యోగులు, కంపెనీల యజమానులిద్దరికీ ఈ విధానం ప్రయోజనంగా ఉంటుందని తెలిపాడు. నాలుగు రోజుల పనివిధానాన్ని మొదట్లో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్ కు సంబంధించిన దాదాపు 30 సంస్థలు ఆమోదించాయి. ఆ తర్వాత మరో 29 సంస్థలు అంగీకరించాయి. వీటిలో స్వచ్ఛంద, ఎన్జీవో, సోషల్ కేర్, టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 200 కంపెనీలకు కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
కోవిడ్ మహమ్మారి తర్వాత పని విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంటి వద్ద ఉండి పని చేయడానికి ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం జేపీ మోర్గాన్ చేజ్, అమెజాన్ వంటి వారానికి ఐదు రోజులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే కంపెనీలపై ఆసక్తి తగ్గిపోతోంది. ఉదాహరణకు స్టార్లింగ్ బ్యాంక్ సీఈవో తన సిబ్బందిని తరచూ కార్యాలయానికి రావాలని కోరినప్పుడు, దానికి నిరసనగా ఉద్యోగులు సామూహిక రాజీనామా చేశారు. బ్రిటన్ లోని లేబర్ పార్టీకి చెందిన ప్రముఖులు కూడా నాలుగు రోజుల పని విధానానికి మద్దతు తెలిపారు. అయితే ఆ పార్టీ అధికారికంగా ఈ విధానాన్ని ఆమోదించలేదు. ఒక సర్వే ప్రకారం.. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న వారిలో 78 శాతం మంది నాలుగు రోజుల పని విధానంపై ఆసక్తి చూపుతున్నారు. యువ కార్మికులు మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్నారని, దానిలో భాగంగా నాలుగు రోజుల పని విధానానికి మద్దతు తెలుపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి