AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nominee: వివిధ స్కీమ్‌లు, బ్యాంకు ఖాతాల్లో నామినీ పేరును ఎందుకు చేర్చాలి.. లేనట్లయితే ఏమవుతుంది.. పూర్తి వివరాలు

Nominee: బ్యాంకు ఖాతాలు తీసుకోవడం, వివిధ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం లాంటివి చేసే సమయంలో నామినీ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. నామినీలో భార్య లేదా, తల్లి,..

Nominee: వివిధ స్కీమ్‌లు, బ్యాంకు ఖాతాల్లో నామినీ పేరును ఎందుకు చేర్చాలి.. లేనట్లయితే ఏమవుతుంది.. పూర్తి వివరాలు
Subhash Goud
|

Updated on: Jan 04, 2022 | 1:36 PM

Share

Nominee: బ్యాంకు ఖాతాలు తీసుకోవడం, వివిధ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం లాంటివి చేసే సమయంలో నామినీ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. నామినీలో భార్య లేదా, తల్లి, ఇంకా ఎవరైనా వారసులు ఉంటే వారి పేర్లను ఇవ్వడం తప్పనిసరి. కానీ కొందరు నామినీ గురించి పెద్దగా పట్టించుకోరు. బ్యాంకు లావాదేవీల విషయంలో, పెట్టుబడులు , ఇన్సూరెన్స్‌ స్కీమ్‌లను తీసుకునేవారికి ఏదైనా ప్రమాదం జరిగి మరణించినట్లయితే వచ్చే మొత్తం నామినీకి చెందుతుంది. నామినీ పేరు చేర్చనట్లయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వాస్తవానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం ఉంది.

యజమాని మరణించిన సందర్భంలో.. పెట్టుబడుల విషయంలో అసలు యజమాని మరణించిన సందర్భంలో.. వాటిని అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందించేందుకు నామినీ తోడ్పడతారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డీమ్యాట్‌ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ పేరు తప్పనిసరి.

ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం.. ఆ ఖాతాదారుడికి ఏదైనా జరిగినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధ్రువీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పవచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము దాదాపు రూ.25,000 కోట్ల వరకూ ఉంది. ఈ మొత్తం అంతా నామినీ వివరాలు సరిగా లేకపోవడమే కారణం.

నామినీ పేరును మార్చుకోవచ్చు.. ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.

నామినీలు ఎంత మంది ఉండవచ్చు.. బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. అలాగే ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా పేర్కొనవచ్చు. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Omicron Treatment: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చికిత్సకు ఆరోగ్య బీమా..ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం..!

One Moto India: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన ప్లాంట్‌.. భారీగా ఉద్యోగ అవకాశాలు