WhatsApp: యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇక డబ్బులు చెల్లిస్తేనే వాట్సాప్ సేవలు..!
WhatsApp: వాట్సాప్.. దీని గురించి తెలియనివారంటు ఉండరేమో. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ ను ఉపయోగిస్తు్న్నారు. అయితే ఇప్పుడు వాట్సాప్ సేవలు పొందాలంటే అందుకు ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే..

WhatsApp: ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లలో వాట్సాప్ ఉంటుంది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లలో ఆందోళన నెలకొంది.
రాబోయే రోజుల్లో వాట్సాప్ ఉపయోగించాలంటే వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌లో ప్రకటన రహిత (Ad-Free) సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే సంస్థ నుంచి దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కంపెనీ వినియోగదారులకు ప్రకటన రహిత అనుభవాన్ని అందించే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై పనిచేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని అర్థం మీరు మీ వాట్సాప్ స్టేటస్, ఛానెల్‌లలో ప్రకటనలను చూడకూడదనుకుంటే మీరు చెల్లింపు ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. ఈ ప్లాన్ గురించి ఇంకా పెద్దగా సమాచారం వెల్లడి కాలేదు, కానీ దాని దృష్టి ప్రకటన రహిత అనుభవంపైనే ఉంటుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ATM Notes: ఇక ఏటీఎంలలో 10,20,50 రూపాయల నోట్లు.. అక్కడ ట్రయల్ ప్రారంభం!
గత సంవత్సరం మెటా వాట్సాప్ స్టేటస్‌లు, ఛానెల్‌లలో ప్రకటనలను చూపించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై భారీగా వ్యతిరేకత ఎదురైంది. గతంలో ప్రకటన రహిత అనుభవాన్ని ఆస్వాదించిన వాట్సాప్ వినియోగదారులు ఈ మార్పుతో వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఇప్పుడు కంపెనీ కొత్త ప్లాన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని కోసం వినియోగదారులు ప్రకటన రహిత అనుభవానికి చెల్లించాల్సి రావచ్చు. వాట్సాప్ వెర్షన్ 2.26.3.9 లోని యాప్ కోడ్‌లో కొత్త స్ట్రింగ్‌లు గమనించారు. దీని వలన కంపెనీ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై పనిచేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి.
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర, ఫీచర్లు లేదా విడుదలకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. నివేదికల ప్రకారం.. ఈ ప్లాన్ ప్రకటనలను తొలగించడంపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఇందులో ఎటువంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం లేదు. ఇంకా దీని లభ్యత కూడా అస్పష్టంగా ఉంది. మెటా ఎంపిక చేసిన ప్రదేశాలలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల కోసం ప్రకటన-రహిత సబ్‌స్క్రిప్షన్ ఎంపికలను ప్రారంభించింది. కానీ ఇది యూరోపియన్ యూనియన్ ఒత్తిడి కారణంగా జరిగింది. వాట్సాప్ ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుందా లేదా ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే అందించబడుతుందా అనేది ఇంకా తెలియదు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




