AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం రూ.7 లకే జత చెప్పులు! తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేద్దాం అనుకుంటే బెస్ట్ ఐడియా!

తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునేవారికి ఢిల్లీలోని టెలివారా ఫుట్‌వేర్ మార్కెట్ గొప్ప అవకాశం. ఇక్కడ చెప్పులు, శాండిల్స్, బూట్లు వంటి అనేక రకాల పాదరక్షలు అతి తక్కువ ధరలకు లభిస్తాయి. రూ.20 వేల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టి లాభాలు పొందవచ్చు.

కేవలం రూ.7 లకే జత చెప్పులు! తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేద్దాం అనుకుంటే బెస్ట్ ఐడియా!
Footwear Business
SN Pasha
|

Updated on: Jul 12, 2026 | 3:40 PM

Share

చాలా మంది తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు. కానీ, ఏ బిజినెస్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలనే విషయాలపై కొంతమందికి సరైన అవగాహన ఉండదు. మరి అలాంటివారికి ఎంతో కొంత ఉపయోగపడే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని భావించే వారికి ఢిల్లీలోని టెలివారా ఫుట్‌వేర్ మార్కెట్ మంచి అవకాశంగా నిలుస్తోంది. దేశంలోనే ప్రముఖ హోల్‌సేల్ ఫుట్‌వేర్ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన ఈ మార్కెట్‌లో చెప్పులు, శాండిల్స్, స్పోర్ట్స్ షూస్, స్కూల్ షూస్, మహిళల ఫ్యాషన్ ఫుట్‌వేర్ వంటి అనేక రకాల ఉత్పత్తులు అతి తక్కువ ధరలకు లభిస్తాయి. అందుకే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది వ్యాపారులు ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తుంటారు.

సదర్ బజార్ సమీపంలోని నబీ కరీం, పహర్‌గంజ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ మార్కెట్‌లో వందలాది హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు దక్షిణ భారత రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు ఇక్కడికి చేరుకుంటారు. చిన్న గ్రామాల్లోని దుకాణాల నుంచి పెద్ద రిటైల్ షోరూమ్‌ల వరకు అనేక వ్యాపారులు తమ పాదరక్షల స్టాక్‌ను ఈ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తారు. సోషల్ మీడియాలో ఇక్కడ చెప్పులు కేవలం రూ.7కే దొరుకుతాయని తరచూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం పూర్తిగా అందరికీ వర్తించదు. సాధారణ EVA లేదా PVC స్లిప్పర్లను డజన్ల కొద్దీ లేదా వందల జతలుగా టోకు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే అలాంటి ధరలు లభించే అవకాశం ఉంటుంది. ఒక్కటి లేదా రెండు జతలు కొనుగోలు చేసే సాధారణ వినియోగదారులకు అదే ధర వర్తించదు. ఉత్పత్తి నాణ్యత, డిజైన్, పరిమాణం, కొనుగోలు చేసే సంఖ్య ఆధారంగా ధరలు మారుతుంటాయి.

ఈ మార్కెట్‌లో సాధారణ స్లిప్పర్ల నుంచి ప్రీమియం షూల వరకు అన్ని బడ్జెట్‌లకు సరిపోయే ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. పిల్లల చెప్పులు, మహిళల శాండిల్స్, పురుషుల స్లిప్పర్లు, స్పోర్ట్స్ షూస్, స్కూల్ షూస్ వంటి అనేక రకాల పాదరక్షలను తక్కువ ధరల్లో కొనుగోలు చేయవచ్చు. పెద్ద బ్రాండ్‌లతో పోలిస్తే తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు లభించడం ఈ మార్కెట్ ప్రత్యేకతగా చెప్పబడుతోంది. వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఈ మార్కెట్ మంచి ఎంపికగా భావిస్తున్నారు. సుమారు రూ.20 వేల పెట్టుబడితోనే వివిధ డిజైన్లలో చెప్పులు, శాండిల్స్ కొనుగోలు చేసి చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించవచ్చు. రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు పెట్టుబడి ఉంటే మరింత విస్తృతంగా స్టాక్ సిద్ధం చేసి దుకాణం, ఆన్‌లైన్ స్టోర్ లేదా సోషల్ మీడియా వేదికల ద్వారా విక్రయాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే లాభదాయకమైన వ్యాపారం కోసం నాణ్యత, మార్కెట్ డిమాండ్, రవాణా ఖర్చులు, నిల్వ వ్యయం వంటి అంశాలను ముందుగానే అంచనా వేయాలని వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు.

మొదటిసారి ఈ మార్కెట్‌కు వెళ్లేవారు ఒకేసారి భారీగా కొనుగోలు చేయకుండా ముందుగా పలు దుకాణాల్లో ధరలు, నాణ్యతను పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు. సరైన బిల్లు తీసుకోవడం, ఉత్పత్తులను పూర్తిగా తనిఖీ చేయడం, టోకు కొనుగోళ్లలో బేరం చేయడం ద్వారా ఖర్చును మరింత తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. సరైన ప్రణాళికతో ముందుకెళితే తక్కువ పెట్టుబడితోనే పాదరక్షల వ్యాపారంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us