AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్‌కు శాపంగా మారిన టాస్.. ఏ భారత కెప్టెన్‌కూ రాని అత్యంత చెత్త రికార్డ్

Shreyas Iyer : ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా వైట్‌ వాష్ కావడంతో శ్రేయస్ అయ్యర్ పేరిట చెత్త రికార్డు నమోదైంది. వరుసగా 7 టాస్‌లు గెలిచినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక భారత కెప్టెన్‌గా ఎవరూ ఎదుర్కోని అపకీర్తిని మూటగట్టుకున్నాడు.

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్‌కు శాపంగా మారిన టాస్.. ఏ భారత కెప్టెన్‌కూ రాని అత్యంత చెత్త రికార్డ్
Shreyas Iyer (5)
Rakesh
|

Updated on: Jul 12, 2026 | 3:38 PM

Share

Shreyas Iyer : క్రికెట్ మ్యాచ్‌లో ఏ కెప్టెన్ అయినా టాస్ గెలవాలని కోరుకుంటాడు. టాస్ గెలిస్తే తమ వ్యూహాలకు తగ్గట్టుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది కెప్టెన్లు టాస్ గెలవడమే కాకుండా మ్యాచ్‌లను కూడా గెలిచి అదృష్టవంతులుగా నిలుస్తారు. కానీ భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం టాస్ అనేది ఒక పెద్ద శాపంగా మారింది. అయ్యర్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచినప్పటికీ, దురదృష్టవశాత్తూ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయాన్ని అందుకోలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో జట్టు బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్, కెప్టెన్‌గా తన తొలి బోణీ కొట్టడం కోసం కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన కెప్టెన్సీలో భారత్.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఘోరమైన పరాజయాలను చవిచూసింది.

టాస్ గెలిచినా ఒరిగిందేమీ లేదు

ఈ విదేశీ పర్యటనల కథ ఐర్లాండ్ సిరీస్‌తో మొదలైంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ నిర్ణయం భారత జట్టుకు అస్సలు కలిసిరాలేదు. ఐర్లాండ్ జట్టు అద్భుతంగా ఆడి మొదటి మ్యాచ్‌ను 34 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌ను కేవలం ఒక్క పరుగు తేడాతో గెలుచుకుంది. దీనివల్ల భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఒక సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌గా ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే బ్యాడ్ లక్ అయ్యర్‌ను వెంటాడింది.

బ్రిస్టల్ నుంచి సాతాంప్టన్ దాకా బౌలర్ల వైఫల్యం

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ అయ్యర్ ఐదు సార్లూ టాస్ గెలిచాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 189 పరుగుల మంచి స్కోరు చేసింది. అయితే చెస్టర్ లీ స్ట్రీట్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండానే మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత మాంచెస్టర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 190 పరుగులు చేసినా, ఇంగ్లండ్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో మ్యాచ్ టీమిండియాకు ఒక పీడకలగా మిగిలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 201 పరుగులు చేయగా, భారత్ కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. దీంతో 125 పరుగుల తేడాతో భారత్ తన చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని నమోదు చేసింది.

Read Also : IND vs ENG : ఒక్క మ్యాచులో రెండు రికార్డులు.. ధోని ఆల్-టైమ్ రికార్డులను బ్రేక్ చేసిన జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్

ఒకే సిరీస్‌లో నాలుగు ఓటములు

సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన బ్రిస్టల్ నాలుగో టీ20లో అయ్యర్ మళ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టు కేవలం 158 పరుగులకే పరిమితం కాగా, ఇంగ్లండ్ జట్టు కేవలం 13.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఊదేశింది. చివరిగా సాతాంప్టన్‌లో జరిగిన ఐదో టీ20లో టాస్ గెలిచిన అయ్యర్ ఈసారి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కానీ హోస్ట్ టీమ్ ఏకంగా 257 పరుగుల స్కోరును నమోదు చేసింది. ఛేజింగ్‌లో భారత్ 201 పరుగులు చేసినప్పటికీ 56 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. దీంతో ఇంగ్లండ్ జట్టు భారత్‌పై తొలిసారి టీ20 సిరీస్‌ను 4-0తో సొంతం చేసుకుంది.

ప్రపంచ క్రికెట్‌లోనే నాల్గో ఆటగాడిగా అయ్యర్ అపకీర్తి

ఈ ఓటములతో శ్రేయస్ అయ్యర్ భారత క్రికెట్‌లో ఎవరూ కోరుకోని కొన్ని విచిత్రమైన, అవమానకరమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన మొదటి భారత కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు. అంతేకాదు ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న ఒక దేశానికి కెప్టెన్‌గా ఉంటూ, తన కెరీర్ ప్రారంభించిన మొదటి ఏడు టీ20 మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన ప్రపంచ క్రికెట్ చరిత్రలోని నాల్గో ఆటగాడిగా అయ్యర్ అపకీర్తి మూటగట్టుకున్నాడు. వీటన్నింటికీ తోడు, ఒకే టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్‌లో భారత్ నాలుగు మ్యాచ్‌లను ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us