SBI: ఎస్బీఐ ఖాతాదారులు బీ అలర్ట్.. విత్ డ్రా రూల్స్ మారాయ్.. ఈ లిమిట్ దాటితే బాదుడే..
ఎస్బీఐ శాలరీ అకౌంట్ వాడుతున్నారా.. అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని ఎస్బీఐ తగ్గించింది. అక్టోబర్ నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. దీంతో మీరు ఇతర బ్యాంక్ ఏటీఎంలలో ట్రాన్సాక్షన్లు చేస్తుంటే ఈ నిబంధనల గురించి తెలుసుకోండి.

తమ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. శాలరీ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్ అందించింది. యూపీఐ లావాదేవీల కాలం నడుస్తున్నా చాలామంది ఇప్పటికే ఏటీఎంలను ఉపయోగిస్తున్నారు. ఏటీఎం నిర్వహణ అనేది బ్యాంకులకు ఖర్చుతో కూడుకున్నది. ఈ క్రమంలో ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని బ్యాంకులు క్రమక్రమంగా తగ్గించేస్తున్నాయి. తాజాగా ఎస్బీఐ తమ శాలరీ అకౌంట్ ఖాతాదారులకు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల లిమిట్‌ను తగ్గించింది. ఎస్బీఐ శాలరీ ఖాతా ఉన్నవారు ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో లభించే నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్ల లిమిట్‌ను తగ్గించింది.
నెలకు ఐదు మాత్రమే ఫ్రీ..
ఇంతకముందు ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉన్నవారు ఇతర బ్యాంక్ ఏటీఎంలో నెలకు 10 ఉచిత లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఉండేది. కానీ అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పరిమితిని ఐదుకు ఎస్బీఐ తగ్గించింది. ఈ పరిమితిలో ఆర్ధిక లావాదేవీలతో పాటు ఆర్ధికేతల లావాదేవీలకు కూడా కలిసి ఉంటాయి. అంటే, నగదు విత్ డ్రాతో పాటు బ్యాలెన్స్ చెకింగ్, స్టేట్ మెంట్ వంటి ట్రాన్సాక్షన్లకు కూడా ఉచిత పరిమితి వర్తిస్తుంది. వేరే బ్యాంక్ ఏటీఎంల్లో లావాదేవీలు చేసేవారు ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. లేకపోతే పెనాల్టీలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఏటీఎంలను ఎక్కువగా ఉపయోగించేవారు, క్రమం తప్పకుండా వినియోగించేవారు ఈ ఛార్జీల గురించి తెలుసుకోవాలి. 5 ఉచిత లావాదేవీలు ఇతర ఏటీఎంల్లో మించి చేస్తే అదనపు ఛార్జీలు పడతాయి.
ప్రతీ అదనపు విత్ డ్రాకు రూ.23తో పాటు జీఎస్టీ ఉంటుంది. అంటే జీఎస్టీతో కలిపి రూ.27.14 పడుతుంది. ఈ లెక్క మూడు అదనపు విత్ డ్రాలకు రూ. 81.42, ఐదు అదనపు నగదు విత్ డ్రాలకు రూ.135.70 ఛార్జీ పడుతుంది. ప్రతీ నెలా మీరు అదనపు విత్ డ్రాలు కొనసాగిస్తే ఏడాదికి రూ.1600 కంటే ఎక్కువ మొత్తానికి చేరుతుంది. అయితే ఐదు ఉచిత లావాదేవీల పరిమితిలో నగదు విత్ డ్రాలే కాకుండా బ్యాలెన్స్ చెకింగ్ లాంటి ఆర్థికేతర లావాదేవీలను కూడా చేర్చారు. కానీ ఎస్బీఐ ఏటీఎంలో ఎలాంటి లిమిట్ ఉండదు. నెలకు ఎన్ని అయినా ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇక సేవింగ్ అకౌంట్ల విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు వర్తిస్తాయి. సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఇతర బ్యాంకుల ATMలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇక ఎస్బీఐ ఏటీఎంలలో నెలకు 10 నగదు లావాదేవీలు ఉచితంగా కొనసాగించుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఖాతాదారులు ఈ విషయాలను గమనించాలని ఎస్బీఐ కోరింది.
