శెనగపప్పు మటన్ కూర.. మన తాతలు బలంగా ఉన్నారంటే ఇలాగే చేసుకుని తినేవాళ్ళు
నాన్‌వెజ్ తినే వారికిలో మటన్‌ను సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. వీరికి సండే వచ్చిందింటే ఇంట్లో కచ్చితంగా మటన్ ఉండాల్సిందే. అయితే ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈ పండే మీరు భీమవరం స్పెషల్ శెనగపప్పు మటన్ కూరను ట్రై చేయండి. ఒక్కసారి దీని రుచి చూశారంటే ఇక, ప్రతి సండే ఇదే కావాలి అంటారు. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

ఆంధ్ర వంటకాల ఘుమఘుమలు, ఘాటైన మసాలాల రుచులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శైలి మాంసాహార వంటకాలకు ఆహార ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. భీమవరం ప్రాంతంలో ఎంతో విశిష్టమైన వంటకంగా పేరుగాంచినదే శెనగపప్పు మటన్ కూర. నోట్లో వేస్తే కరిగిపోయే మటన్ ముక్కలకు తోడు, పచ్చిశెనగపప్పు అందించే విలక్షణమైన రుచి, పోషకాలు ఈ వంటకాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. సంప్రదాయ పద్ధతిలో, పక్కా కొలతలతో ఈ రుచికరమైన కూరను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
శెనగపప్పు మటన్ కావలసిన పదార్థాలు:
- శుభ్రంగా కడిగి మటన్ అర కిలో
- పచ్చిశెనగపప్పు: 2 గంటల పాటు నానబెట్టినది 1 కప్పు
- నూనె: 4 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు: సన్నగా తరిగినవి 2
- పచ్చిమిర్చి: 2 ముక్కలుగా తరిగినవి
- పసుపు: సరిపడా
- ఉప్పు: రుచికి సరిపడా
- కారం: 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర, పుదీనా: తగినంత
- నీళ్లు: 1 గ్లాసు
ఫ్రెష్ మసాలా పేస్ట్ కోసం
ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర అర టేబుల్ స్పూన్, గసగసాలు అర టేబుల్ స్పూన్, లవంగాలు (4), యాలక్కాయ (1), దాల్చినచెక్క అంగుళం ముక్క, అల్లం 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి రెబ్బలు (8).
శెనగపప్పు మటన్ కూర తయారీ విధానం
ముందుగా శుభ్రం చేసిన మటన్‌ను ప్రెషర్ కుక్కర్‌లో వేయాలి. అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పచ్చిశెనగపప్పును శుభ్రంగా కడిగి కనీసం రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడకడమే కాకుండా కూరకు చక్కని ఆకృతి వస్తుంది.
మసాలా తయారీ: ఇప్పుడు ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లిని మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తాజా మసాలానే కూరకు అసలైన భీమవరం ఘుమఘుమలను తెచ్చిపెడుతుంది.
తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అనంతరం నానబెట్టి నీళ్లు వడకట్టిన పచ్చిశెనగపప్పును, సిద్ధం చేసుకున్న తాజా మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేలా 5 నుంచి 7 నిమిషాల పాటు నూనెలో బాగా వేయించాలి.
ఇప్పుడు మసాలా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి కలపాలి. ఆపై ముందుగా కుక్కర్‌లో ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను రసంతో సహా బాండీలో వేయాలి. ఇందులోనే మరో చిటికెడు పసుపు, కారం వేసి ముక్కలకు మసాలా పట్టేలా బాగా కలపాలి. చివరగా ఒక గ్లాసు నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటపై ఉడికించాలి.
గ్రేవీ చిక్కబడి, కూర పైకి నూనె తేలేంత వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి. దీంతో నోరూరించే సాంప్రదాయ ‘భీమవరం మటన్ శెనగపప్పు కూర’ రెడీ అవుతుంది. ఈ కూరను వేడివేడి అన్నం, రోటీ, చపాతీ లేదా పుల్కాతో వడ్డించుకుంటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.
