హాల్‌మార్క్ లేని బంగారం, వెండి ఉందా? గ్రామాల్లోనే ప్యూరిటీని ఎలా చెక్ చేసుకోవాలి?
Gold Purity Check: మీ దగ్గర హాల్‌మార్క్ లేని పాత బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయా? వాటి స్వచ్ఛతను పరీక్షించుకోవడానికి నగల దుకాణాలే కాకుండా మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉండేవారు బంగారం నాణ్యతను ఎక్కడ పరీక్షించుకోవాలి? బీఐఎస్ గుర్తింపు పొందిన కేంద్రాల్లో పరీక్షలకు ఎంత ప్రాధాన్యం ఉంది? ఆభరణాల అసలు విలువ తెలుసుకునే ముందు ఈ వివరాలు తెలుసుకోండి.

బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వాటి స్వచ్ఛతపై సందేహాలు రావడం సహజం. కొత్తగా బంగారం కొంటుంటే ఆ బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ ఉందని నిర్థారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. అయితే ఇప్పటికే కొనుగోలు చేసిన బంగారం, వెండి ఆభరణాల స్వచ్ఛతను చెక్ చేసుకోవడం ఎలా? ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో నివసించే వారికి హాల్‌మార్కింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు హాల్‌మార్క్ లేని పాత బంగారు, వెండి ఆభరణాల స్వచ్ఛతను ఎక్కడ పరీక్షించుకోవాలి? ఇందుకోసం అందుబాటులో ఉన్న మార్గాలేమిటో తెలుసుకుందాం.
పెద్ద నగల దుకాణాల్లో పరీక్షించుకోవచ్చు
గ్రామాల సమీపంలోని పట్టణాల్లో ఉన్న పెద్ద నగల దుకాణాల్లో గోల్డ్ టెస్టింగ్ మెషీన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్స్‌ఆర్‌ఎఫ్ (XRF) యంత్రం ద్వారా ఆభరణాన్ని కరిగించకుండా లేదా పెద్దగా నష్టం కలిగించకుండా దాని లోహ స్వచ్ఛతను పరీక్షించే అవకాశం ఉంటుంది. అయితే నాణ్యతా పరీక్షా ఫలితాలు సదరు యంత్రం, పరీక్షా విధానం, ఆభరణం నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పరీక్షించే కేంద్రం విశ్వసనీయమైనదో లేదో నిర్ధారించుకోవాలి.
కొన్ని చోట్ల అనుభవం ఉన్న స్వర్ణకారులు కసౌటి రాయి, రసాయనాల సాయంతో బంగారం అసలైనదో కాదో ప్రాథమికంగా పరీక్షిస్తారు. అయితే ఈ పద్ధతి ద్వారా ఖచ్చితమైన క్యారెట్ వివరాలు తెలుసుకోవడం సాధ్యంకాకపోవచ్చు.
గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు
గ్రామంలో లేదా సమీప పట్టణంలో బంగారంపై రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఉంటే అక్కడి అధికారిక గోల్డ్ వాల్యుయర్లను సంప్రదించవచ్చు. వారు సాధారణంగా రుణం మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా బంగారం స్వచ్ఛతను పరీక్షిస్తారు. అయితే వ్యక్తిగతంగా పరీక్షించేందుకు వారు అంగీకరిస్తారా? ఏమైనా రుసుము వసూలు చేస్తారా అనేది ముందుగానే తెలుసుకోవాలి.
బీఐఎస్ గుర్తింపు పొందిన కేంద్రం ఉత్తమ మార్గం
హాల్‌మార్క్ లేని పాత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తింపు పొందిన అసేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో పరీక్షించుకోవచ్చు. సాధారణ వినియోగదారులు తమ ఆభరణాలను పరీక్ష కోసం తీసుకెళ్లవచ్చని బీఐఎస్ వెల్లడించింది. బంగారాన్ని పరీక్షించిన తర్వాత ఆభరణం స్వచ్ఛతకు సంబంధించిన నివేదికను కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం నిర్ణీత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల వివరాలను బీఐఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. వెళ్లే ముందు కేంద్రం చిరునామా, పరీక్షా రుసుము, అవసరమైన పత్రాల గురించి నిర్ధారించుకోవడం మంచిది.
అలాగే బంగారం కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్క్, ఆరు అంకెల HUID గుర్తు, బిల్లు వంటి వివరాలను పరిశీలించాలి. హాల్‌మార్క్ ఉన్న ఆభరణాల HUID నంబర్‌ను బీఐఎస్ కేర్ యాప్‌లోని ‘Verify HUID’ సదుపాయం ద్వారా తనిఖీ చేయవచ్చు.




